Share News

సాగు.. జాగు

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:02 AM

జిల్లాలో ఈ ఏడాది రబీ సాగు ముందుకు సాగడం లేదు. సీజన్‌ ప్రారంభమై రెండు మాసాలు గడిచినా సాధారణ విస్తీర్ణంలో కనీసం 20శాతం కూడా పంటలు పడలేదు. విస్తారంగా రబీ సాగుచేసే సమయంలో జిల్లాను మొంథా తుఫాన్‌ ముంచెత్తింది.

సాగు.. జాగు
దుక్కి దున్ని ఖాళీగా ఉన్న భూమి

ముందుకు సాగని రబీ

రెండు నెలల్లో 20శాతం విస్తీర్ణం కూడా లేదు

ప్రకృతి ప్రతికూలతే కారణం

మొంథా తుఫాన్‌ ముంచెత్తడంతో

చాలాచోట్ల విత్తనం వేయలేకపోయిన రైతులు

తాజా వాతావరణంతో మరింత ఆలస్యమవుతుందని ఆందోళన

జిల్లాలో ఈ ఏడాది రబీ సాగు ముందుకు సాగడం లేదు. సీజన్‌ ప్రారంభమై రెండు మాసాలు గడిచినా సాధారణ విస్తీర్ణంలో కనీసం 20శాతం కూడా పంటలు పడలేదు. విస్తారంగా రబీ సాగుచేసే సమయంలో జిల్లాను మొంథా తుఫాన్‌ ముంచెత్తింది. నవంబరులో సాధారణ వర్షం కూడా పడకపోవడం ప్రతిబంధకంగా మారింది. మరోవైపు ప్రస్తుతం దిత్వా తుఫాన్‌ వలన నెలకొన్న వాతావరణం రైతులను కలవరపెడుతోంది. దీని కారణంగా సాగు మరింత ఆలస్యమవడంతోపాటు పంటలపై తెగుళ్ల దాడి పెరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌.. అక్టోబరు నుంచి డిసెంబర్‌ వరకు రబీ సీజన్‌గా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా కొంతమేర విస్తీర్ణంలో జనవరిలో కూడా పైర్లు వేస్తుంటారు. రబీకి సంబంధించి అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారు. జిల్లాలో వ్యవసాయశాఖ పరిధిలో రబీ సీజన్‌లో సుమారు లక్షా 43వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో 25 రకాల పంటలు వేస్తారు. అందులో శనగ, పొగాకు, వరి, మినుము ప్రధానమైనవి. అలసంద, మొక్కజొన్న వంటివి ఒక మోస్తరుగా వేస్తారు. మొత్తం విస్తీర్ణంలో ఇంచుమించు మూడోవంతు శనగ సాగు చేస్తారు. మరో 22శాతం విస్తీర్ణంలో పొగాకు, 13శాతం విస్తీర్ణంలో వరి, సుమారు 18శాతానికిపైగా విస్తీర్ణంలో మినుము వేస్తారు. అలా ఈ నాలుగు పంటలే దాదాపు రబీ సాగులో 85శాతం వరకు ఉంటాయి. వీటన్నింటినీ అక్టోబరు ఆరంభం నుంచే విస్తారంగా సాగు చేస్తుంటారు. దాదాపు మూడొంతుల విస్తీర్ణంలో ఈ సమయానికి పంటలు సాగవుతాయి.

ఈ ఏడాది 28,605 హెక్టార్లలోనే సాగు

ఈ ఏడాది పరిస్థితి పూర్తిభిన్నంగా కనిపిస్తోంది. మొత్తం లక్షా 43వేల హెక్టార్ల రబీ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు కేవలం 28,605 హెక్టార్లలోనే పైర్లు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంటే రబీ సీజన్‌ ప్రారంభమై రెండు మాసాలు గడిచినా సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.94శాతంలో మాత్రమే రైతులు పంటలు వేశారు. శనగ సాధారణ విస్తీర్ణం 44వేల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 6,400 హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. 26,341 హెక్టార్లలో సాగు చేయాల్సిన మినుము 3,539 హెక్టార్లలో, 19,144హెక్టార్లలో వరి సాధారణ విస్తీర్ణానికి 4,280 హెక్టార్లు, 29,345 హెక్టార్లలో పొగాకు పంట 4,271 హెక్టార్లలో వేశారు. 3,786 హెక్టార్లలో అలసంద, 4,574 హెక్టార్లలో మొక్కజొన్న, మరో 1,300 హెక్టార్లలో జొన్న వేసినట్లు సమాచారం. అలా మొత్తంగా సాధారణ విస్తీర్ణంలో 20శాతం లోపుగానే ఇప్పటి వరకు పంటలు సాగయ్యాయి.

ప్రకృతి ప్రతికూలత

సెప్టెంబరులో మంచి వర్షాలు కురిస్తే దుక్కులు దున్ని అక్టోబరు ఆరంభం నుంచి విస్తారంగా రైతులు రబీ పైర్లు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది సెప్టెంబరులో సాధారణ వర్షం మాత్రమే కురిసింది. రబీ ఆరంభమైన అక్టోబరు తొలిపక్షం అంతా బెట్టవాతావరణం నెలకొంది. దీంతో దుక్కులు దున్నిన రైతులు వర్షం కోసం ఎదురుచూడాల్సి వచ్చి సీజన్‌ ఆరంభంలో పెద్దగా సాగు చేయలేకపోయారు. అక్టోబరు ఆఖరులో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తొలుత రెండు, మూడు రోజులు సాధారణ.. తర్వాత మొంథా తుఫాన్‌తో భారీ వర్షాలు ముంచెత్తాయి. తుఫాన్‌ ప్రభావ సమయంలోనే కాక అనంతరం పదిరోజుల వరకు చాలాచోట్ల పొలంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి బయటపడి భూములు ఆరి సాగుకు ఉపక్రమించిన రైతులకు తిరిగి బెట్ట వాతవరణం ఇబ్బంది పెట్టింది.

ఈనెలలో లోటు వర్షపాతం

ఈనెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 138 మి.మీ కాగా ఇప్పటివరకు కేవలం 10మి.మీ లోపుగానే ఉంది. అంటే 95శాతం లోటు వర్షపాతం నమోదవడంతో మెట్టపైర్ల సాగు ముందుకు కదలలేదు. అలా రబీ సీజన్‌ ఈ ఏడాది తీవ్రప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని ముందుకు సాగలేదు. సాగు ముమ్మరం చేద్దామని భావిస్తున్న తరుణంలో దిత్వా తుఫాన్‌ ప్రభావంతో కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. అలా పంటల సాగు ఆలస్యమైతే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 02:02 AM