Share News

కీలక సమయం.. విప్పాలి గళం

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:26 AM

శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభవుతున్నాయి. ఈ సమయంలో జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు అందరూ ఒకచోట ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మొత్తం రాష్ట్ర మంత్రివర్గం, ఉన్నత స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. దీంతో జిల్లాకు సంబంధించిన ప్రధాన అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

కీలక సమయం.. విప్పాలి గళం

పలు ప్రధాన అంశాలపై సానుకూలంగా ప్రభుత్వం

పశ్చిమంపై ప్రత్యేక ఫోకస్‌

వెలిగొండ, మార్కాపురం జిల్లా, మెడికల్‌ కాలేజీ, డెయిరీకి ప్రాధాన్యం

శాసనసభ్యులు ఉమ్మడిగా దృష్టి సారిస్తే మరింత మేలు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభవుతున్నాయి. ఈ సమయంలో జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు అందరూ ఒకచోట ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మొత్తం రాష్ట్ర మంత్రివర్గం, ఉన్నత స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. దీంతో జిల్లాకు సంబంధించిన ప్రధాన అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అటు సభ లోపల చర్చకు పెట్టడంతోపాటు, ఇటు బయట ప్రభుత్వ పెద్దలను కలిసి వారి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకెళ్లవచ్చు. ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నియోజకవర్గంలోని కీలక అంశాలను వ్యక్తిగతంగా, అలాగే జిల్లా ఉమ్మడి ప్రయోజనాలకు ఉపకరించే వాటిపై కలిసికట్టుగా గళం విప్పాలని ప్రజానీకం కోరుతోంది.

ఒంగోలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : శాసనసభ సమావేశాలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. సమావేశాలు కనీసం వారం రోజులు గరిష్ఠంగా పది రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది.

పశ్చిమ ప్రాంతంపై సానుకూలం

ప్రస్తుతం జిల్లాకు సంబంధించి అనేక కీలక అభివృద్ధి అంశాలపై ప్రధానంగా పశ్చిమప్రాంతంపై ప్రభుత్వం సానుకూలంగా కనిపి స్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు పూర్తయ్యింది. గత ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేపట్టామన్న భావనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ప్రత్యేకించి సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలు అమలు లోకి వచ్చాయి. జిల్లాలోని లక్షలాది మంది వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వాటిపై ప్రజల్లో సానుకూలత కూడా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో జిల్లాల వారీ ఇచ్చిన ప్రధాన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో జిల్లాకు సంబంధించి చూస్తే ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా ఏర్పాటు, ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం, దొనకొండ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, కనిగిరి ప్రాంతంలో సీబీజీ ప్లాంట్‌లు వంటి ఇతరత్రా పలు అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యతలుగా కనిపిస్తున్నాయి.

వచ్చే జూన్‌కు వెలిగొండ..

పశ్చిమ ప్రజల చిరకాల కోరిక అయిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను వచ్చే జూన్‌కు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులకు హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఉన్నతస్థాయిలో నడుస్తోంది. పీపీపీ పద్ధతిలో మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం ఈ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. అందులో తొలి జాబితాలోనే మార్కాపురం మెడికల్‌ కాలేజీని చేర్చింది. ఇక జిల్లాకు తలమానికంగా, పాడి రైతులకు బాసటగా నిలిచే ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపైనా ఆశలు రేకెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి చొరవతో ఇందుకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ ప్రారంభమై ముఖ్యమంత్రి దృష్టి వరకూ వెళ్లింది. దొనకొండ పారిశ్రామిక అభివృద్ధిపై సంబంధిత శాఖల ద్వారా పలు ప్రయత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో డిఫెన్స్‌ క్లస్టర్ల ఏర్పాటులో భాగంగా ఒకటి దొనకొండ వద్ద తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కనిగిరి ప్రాంతంలో రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌కు పునాది పడింది. మరికొన్నిచోట్ల వాటి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

తగు చొరవ అవసరం

అనేక శాశ్వత అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగునకు ఉపకరించే వాటిపై ప్రభుత్వ స్థాయిలో దృష్టిసారించగా వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేసే విధంగా వివిధ రూపాలలో ఒత్తిడి తెచ్చే బాధ్యత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులపై ఉంది. జిల్లాలో పాలనా విభాగంలో మార్పులు, చేర్పులు.. రోడ్లు, సాగు, తాగునీరు, విద్య, వైద్యం విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల మెరుగునకు నిధులు రాబట్టడం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడేందుకు శాసనసభా సమావేశాల సమయం కీలకమైంది. అందుకు తగు చొరవను కీలక ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా, ఉమ్మడిగా చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Sep 18 , 2025 | 02:26 AM