8,140 హెక్టార్లలో పంటలు నష్టం
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:32 PM
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 8,140.18 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు
ప్రాథమికంగా గుర్తించిన వ్యవసాయశాఖ
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 8,140.18 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలోని 159 గ్రామాలకు చెందిన 9,312 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఇంకా వర్షం వీడకపోవడంతో పంట నష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెద్దారవీడు మండలంలో 13 గ్రామాలకు చెందిన 1,309 మంది రైతులు, మార్కాపురం మండలంలో 15 గ్రామాలకు చెందిన 3,260 మంది, తర్లుబాడు మండలంలో 13 గ్రామాలకు చెందిన 99 మంది, కంభం మండలంలో రెండు గ్రామాలకు చెందిన 30 మందిరైతులు, అర్థవీడు మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన 55 మంది రైతులు, మర్రిపూడి మండలంలో 18 గ్రామాలకు చెందిన 420 మంది రైతులు, పొదిలి మండలంలో 27 గ్రామాలకు చెందిన 185 మంది రైతులు, దర్శి మండలంలో ఐదు గ్రామాలకు చెందిన 228 మంది రైతులు, కొనకనమిట్ల మండలంలో మూడు గ్రామాలకు చెందిన 258 మంది రైతులు, దొనకొండ మండలంలో ఐదు గ్రామాలకు చెందిన 389 మంది రైతులకు చెందిన పలు రకాల పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. మొత్తమ్మీద పత్తి 6,178 హెక్టార్లు, మొక్కజొన్న 124.06 హెక్టార్లు, సజ్జ 771.40 హెక్టార్లు, జొన్న 5.42 హెక్టార్లు, వేరుశనగ 9.7 హెక్టార్లలో వర్షాలకు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు.