Share News

సీపీఐ భూపోరాటం

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:40 AM

ఒంగోలులో ఇళ్లు లేని పేదలకు స్థలాలను కేటా యించా లని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం భూపోరాటానికి దిగారు. ముక్తినూతలపాడు సమీపంలోని ఈనాం భూముల్లో చెట్లను తొలగించి పార్టీ జెండాలను పాతారు.

సీపీఐ భూపోరాటం
ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు వద్ద భూ ఆక్రమణకు సిద్ధమవుతున్నపేదలు

ఒంగోలు సమీపంలో 11 ఎకరాల ఈనాం భూముల్లో ఎర్రజెండాలు

ఇంటి స్థలాల కోసం భారీగా తరలివచ్చిన పేదలు

జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు

సీపీఐ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం

నాయకత్వం వహించిన రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా నేత నారాయణ

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో ఇళ్లు లేని పేదలకు స్థలాలను కేటా యించా లని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం భూపోరాటానికి దిగారు. ముక్తినూతలపాడు సమీపంలోని ఈనాం భూముల్లో చెట్లను తొలగించి పార్టీ జెండాలను పాతారు. 186, 187, 188 సర్వే నెంబర్లలోని 11 ఎకరాల ఈనాం భూమిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేదలు చెట్లు, రాళ్లను తొలగించి చదును చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణతోపాటు, ఇతర సీపీఐ ముఖ్యనాయకుల నేతృత్వంలో ఈ భూపోరాటం చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు భూముల వద్దకు వచ్చి వెంటనే ఖాళీ చేయాలని కోరగా పేదలు ససేమిరా అన్నారు. అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. ఆ భూముల వద్దకు చేరుకున్న పోలీసులు సీపీఐ నాయకులను, పేదలను బయటకు పంపేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, సీపీఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ సీపీఐ నాయకులు, పేద మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. సమస్య పరిష్కారానికి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు రావాలని విజ్ఞప్తి చేయడంతో ఘటనా స్థలం నుంచి పేదలు భారీ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌ పిన్నిక మధుసూదన్‌లు చర్చలు ప్రారంభించారు. అర్హులైన పేదలు ఉంటే సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఇవ్వాలని సీపీఐ నాయకులను ఆర్డీవో కోరారు.

అధికారులపై మండిపడ్డ ఈశ్వరయ్య

కల్యాణ మండపాలు, పెట్రోలు బంకులు, హాస్పిటల్స్‌ నిర్మాణాలకు భూములను ఆక్రమిస్తే స్పందించని రెవెన్యూ అధికారులు పేదలు ఇంటి స్థలం కోసం పోరాడుతుంటే దౌర్జన్యం చేయడం ఏమిటని ఈశ్వరయ్య ప్రశ్నించారు. ఒంగోలు నగరంలో 20ఏళ్ల క్రితం పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చారని, వాటిలోని కుటుంబాలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చుచేసి 20వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినా రెండేళ్లుగా ఆ స్థలాల్లో ఒక్క ఇటుక పేర్చలేదన్నారు. ఇంటి స్థలాల కోసం భూపోరాటం చేస్తుంటే పోలీసులు డ్రోన్‌ కెమెరాల ద్వారా చిత్రీకరించి దొంగల్లాగా చూడడం దుర్మార్గంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆర్‌.వెంకట్రావు, శ్రీరామ్‌ శ్రీనివాసులు, ఆర్‌.రామకృష్ణ, మౌలాలి సాలర్‌, నల్లూరి మురళి, ఎం.విజయ, ముత్తన అంజయ్య, దాసరి అంజయ్య, సుబ్బారెడ్డి, నూనె జగన్మోహన్‌రావు, ప్రభాకర్‌, అనంతలక్ష్మి, కట్టా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 01:40 AM