భక్తులు దానం చేసిన గోవులు అమ్మకానికి..
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:02 AM
దేశంలో గోమాతలను పూజించే సంస్కృతి మనది.. అవి అంటే ఎనలేని భక్తిభావం ఇమిడి ఉంది.. అలాంటి గోవులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తమకు తోచిన రీతిలో కాపాడుతుంటారు. అలాంటిది, కాషాయం ధరించిన వ్యక్తి సాక్షాత్తు గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ వాటిని అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంరక్షకుడి ముసుగులో చదలవాడ సర్పంచ్ అకృత్యాలు
అడ్డుకున్న దేవస్థానం ఈవో, టీడీపీ నేత, గ్రామస్థులు
ప్రస్తుతం గోమాతలకు ఆంజనేయుడే దిక్కు...
నాగులుప్పలపాడు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : దేశంలో గోమాతలను పూజించే సంస్కృతి మనది.. అవి అంటే ఎనలేని భక్తిభావం ఇమిడి ఉంది.. అలాంటి గోవులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తమకు తోచిన రీతిలో కాపాడుతుంటారు. అలాంటిది, కాషాయం ధరించిన వ్యక్తి సాక్షాత్తు గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ వాటిని అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే...
నిత్యం కాషాయి వస్ర్తాలు ధరించి ఉండే చదలవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి వరప్రసాదరావు కొన్నేళ్ల క్రితం చీర్వానుప్పలపాడురోడ్డులోని శ్రీఆంజనేయస్వామి దేవస్థానం వద్ద మఠంలో వృద్ధాశ్రమం నడుపుతుండేవాడు. అప్పట్లో దేవస్థానానికి పలువురు భక్తులు, దాతలు గోవులను దానంగా ఇచ్చారు. వాటి సంరక్షణకు అవసరమైన గడ్డి, తవుడు ఇతరత్రావి కూడా దాతలే సమకూర్చుకొంటూ వస్తున్నారు. గోవుల సంరక్షణకు భక్తుల సహకారంతో షెడ్లను కూడా నిర్మించారు. కొద్ది రోజుల క్రితం వృద్ధాశ్రమం మూతపడింది. మొత్తం 22 గోవులున్నాయి. ఇటీవల వాటిని చిలకలూరిపేటకు చెందిన కొందరు వ్యక్తులకు సర్పంచ్ అమ్మకానికి పెట్టారు. వాటిని లారీలలో ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తుండగా దేవస్థాన ఈవో అనిల్‌కుమార్, గ్రామ టీడీపీ నాయకులు బోయిడి బ్రహ్మరాజు, పలువురు గ్రామస్థులు అడ్డుకోవడంతో వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేవస్థానానికి దాతలు ఇచ్చిన గోవులను అమ్ముకోవడం మంచి పద్ధతి కాదని సర్పంచ్‌ను ఈవో అనిల్ హెచ్చరించారు. దీంతో సర్పంచ్ గోవుల సంరక్షణ బాధ్యత తాను తీసుకోనని, వాటి కోసం నిర్మించిన షెడ్లలోని ఫ్యాన్లు, ఇతర సామన్లను తొలగించారు. ఇన్నాళ్లు గోవుల సంరక్షణ చూసింది తానేనని, వాటిపై హక్కు తనకే ఉందని తనను అమ్ముకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని రెండు రోజుల అనంతరం ఈవోపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కూడా వెనకాడలేదు. ఆ విషయం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో తేల్చుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో గోవుల ఆలనాపాలనాను వదిలేశారు. వాటి దుస్థితికి చలించిన గ్రామానికి చెందిన ఓ రైతు వాటి సంరక్షణను చూస్తున్నారు. దాంతో సర్పంచ్ తీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు.