Share News

అట్టహాసంగా కోర్టు భవనాల ప్రారంభం

ABN , Publish Date - Nov 23 , 2025 | 02:48 AM

మార్కాపురం కోర్టు ప్రాంగణంలో రూ.5.20కోట్లతో నిర్మించిన 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల భవన సముదాయాన్ని శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ జి.రామకృష్ణప్రసాద్‌, జస్టిస్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి, కలెక్టర్‌ పి.రాజాబాబు మార్కాపురంలో హాజరయ్యారు.

అట్టహాసంగా కోర్టు భవనాల ప్రారంభం
మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటేశ్వర్లు

హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు

మార్కాపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం కోర్టు ప్రాంగణంలో రూ.5.20కోట్లతో నిర్మించిన 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల భవన సముదాయాన్ని శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ జి.రామకృష్ణప్రసాద్‌, జస్టిస్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి, కలెక్టర్‌ పి.రాజాబాబు మార్కాపురంలో హాజరయ్యారు. పలు విభాగాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఈ ప్రాంత ప్రజల్లో డిమాండ్‌ ఉందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అయితే మార్కాపురంలో అవసరమైన అన్ని రకాల కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మరో ముఖ్య అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రామకృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయ సేవలందించడానికి కోర్టు భవనాలు చాలా అవసరమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు మాట్లాడుతూ కోర్టు ప్రాంగణాల్లో అదనపు భవనాలు నిర్మించడం వలన కేసులు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజల భూములకు సంబంధించిన సమస్యలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మార్కాపురంలో అదనపు కోర్టు భవనాలు నిర్మించడం వలన కేసులు సులభతరంగా పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి, అదనపు జిల్లా ప్రధాన న్యాయాధికారి రాజా వెంకటాద్రి, మార్కాపురం 6వ అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.శుభవాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అలీజహీర్‌, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 02:48 AM