ఆటల్లో అవినీతి
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:27 AM
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో అవినీతి విజయం సాధించింది. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఎస్‌జీఎఫ్ పోటీలు సెక్రటరీకి వరంగా మారాయి. మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో స్కూల్ గేమ్స్ నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు స్వాహా చేశారు.
క్రీడా నిధుల్లో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చేతివాటం
స్కూల్ గేమ్స్ నిర్వహణ ఖర్చులు, బస్ చార్జీలు చెల్లించకుండా దోపిడీ
కోఆర్డినేటర్‌లకు మొండిచెయ్యి
విచారణ చేస్తే వెలుగులోకి వాస్తవాలు
ఒంగోలు, కార్పొరేషన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో అవినీతి విజయం సాధించింది. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఎస్‌జీఎఫ్ పోటీలు సెక్రటరీకి వరంగా మారాయి. మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో స్కూల్ గేమ్స్ నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు స్వాహా చేశారు. తన ఖాతాలో జమ చేసుకున్నారు. దీంతో కోఆర్డినేటర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మండల జట్లు విజేతలుగా నిలవాలన్న పట్టుదలతో అవసరమైన శిక్షణ, పోటీలు నిర్వహించిన వారికి మొండిచెయ్యి చూపడం విమర్శలకు తావిస్తోంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఆటల పోటీల నిర్వహణ విషయంలో సెక్రటరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో కోఆర్డినేటర్‌లకు ఇవ్వాల్సిన నిధులు సగం మాత్రమే చెల్లించడంతో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ తీరును పలువురు తప్పుబడుతున్నారు. తమకు రూ.5వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా 2,500 మాత్రమే చెల్లించడం పట్ల ఆవేదన చెందుతున్నారు.
స్కూల్ గేమ్స్ లక్ష్యమిదీ..!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వడంతోపాటు, అవసరమైన సహకారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్‌ను ఏర్పాటు చేసింది.కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగా, చెస్, అథ్లెటిక్స్‌తోపాటు 30 విభాగాల క్రీడా పోటీలు ఏటా నిర్వహించి వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా చేయడమే ఎస్‌జీఎఫ్ లక్ష్యం. మొదట మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో అండర్-14, 17 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. అందుకోసం కోసం ప్రభుత్వం మండల స్థాయికి రూ.5వేలు కేటాయించింది.
ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చేతివాటం
గతేడాది జరిగిన స్కూల్ గేమ్స్ పోటీలలో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుంచి వెయ్యి మంది వరకు వివిధ విభాగాల్లో పోటీలలో పాల్గొని ప్రతిభ చాటారు. అయితే ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడకుండా, దాతల ప్రోత్సాహాంతో పోటీలను ఆయా మండల కోఆర్డినేటర్‌లు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన సొమ్ము ఐదు నెలల క్రితమే ఎస్‌జీఎఫ్‌కు విడుదలైంది. అయితే జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాధ్యతలు నిర్వర్తించే ఇన్‌చార్జి సెక్రటరీ చేతివాటం చూపారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 38 మండల కోఆర్డినేటర్‌లకు ఇవ్వాల్సిన రూ.5వేలలో రూ.2,500 మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని బొక్కేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్ర, జాతీయ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు బస్ చార్జీలు ఇవ్వడంతోపాటు, వారితోపాటే వెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత సెక్రటరీపై ఉంది. అయితే ఏ ఒక్క జట్టుకు చార్జీలు ఇవ్వకపోవడంతోపాటు క్రీడా జట్లతో కలిసి సెక్రటరీ ఇతర ప్రాంతాల్లో జరిగే పోటీలకు వెళ్లలేదని సమాచారం. దీంతో క్రీడాకారులే సొంతంగా చార్జీలు భరించగా, మరికొందరు దాతల సహాయంతో పోటీలకు హాజరైనట్లు సమాచారం. అనేక వ్యయప్రయసాలకోర్చి, కొందరు కోఆర్డినేటర్లు అప్పుడు చేసి మరీ పోటీలు నిర్వహించగా, వారికి చెందాల్సిన నగదును సెక్రటరీ దోచేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జరిగిన స్కూల్ గేమ్స్‌కు నిధులు మంజూరు, పోటీల నిర్వహణకు అయిన ఖర్చులు, కోఆర్డినేటర్‌లకు చెల్లింపులపై విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అంటున్నారు.