ఎన్‌జీపాడు ఎస్సైపై అవినీతి ఆరోపణలు
ABN , Publish Date - May 25 , 2025 | 01:21 AM
నాగులుప్పలపాడు ఎస్‌ఐ శ్రీకాంత్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో షేక్ రజియాసుల్తానాను ఇక్కడ నియమించినట్లు సమాచారం. ఇటీవల నాగులుప్పలపాడులోని అంకమ్మతల్లి కొలుపుల సందర్భంగా రెండువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
సెలవుపై వెళ్లిన శ్రీకాంత్
రజియాసుల్తానా నియామకం?
నాగులుప్పలపాడు, మే 24 : నాగులుప్పలపాడు ఎస్‌ఐ శ్రీకాంత్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో షేక్ రజియాసుల్తానాను ఇక్కడ నియమించినట్లు సమాచారం. ఇటీవల నాగులుప్పలపాడులోని అంకమ్మతల్లి కొలుపుల సందర్భంగా రెండువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్ ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. పోతవరం గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య జీవాలు మేపుకునే విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వర్గం నుంచి పెద్దఎత్తున నగదు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక బి.నిడమా నూరు గ్రామంలో జరిగిన వివాదంలోనూ శ్రీకాంత్ భారీ మొత్తంలో వసూలు చేసి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అలాగే రేషన్ మాఫియాను నడిపిస్తున్న ఉప్పుగుం డూరు గ్రామానికి చెందిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు కాగా, అతని వద్ద నుంచి పెద్దఎత్తున వసూలు చేసి అరెస్టు చేయకుండా తప్పించారన్న అభియోగం కూడా ఉంది. మూడు రోజుల క్రితం అదే వ్యక్తిపై నమోదైన గంజాయి కేసు విషయంలోనూ భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ శ్రీకాంత్ అవినీతి బాగోతాన్ని సదరు రేషన్ మాఫియా నిర్వహిస్తున్న వ్యక్తే ఒంగోలులోని ఓ పోలీసు ఉన్నతాధికారి వద్ద వివరించినట్లు తెలిసింది. దీంతో విషయం ఎస్పీ దామోదర్ దృష్టికి వెళ్లింది. ఆయన తన కార్యాలయానికి పిలిపించుకొని శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈక్రమంలో శ్రీకాంత్ ఆరోగ్య సమస్యను చూపుతూ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిన ట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న షేక్ రజియా సుల్తానా ఆదివారం బాధ్య తలు చేపట్టనున్నట్లు సమాచారం.