భూముల రీసర్వే లోపాలను సరిదిద్దరే..?
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:47 PM
రీసర్వే చేయడం ద్వారా నమోదైన లోపాలను ఇంతవరకు రెవెన్యూ అధికారులు సరిచేయలేక పోయారంటూ పలు గ్రామాల సర్పంచులు రెవెన్యూ అధికారులపై ధ్వజమెత్తారు.
మార్టూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రీసర్వే చేయడం ద్వారా నమోదైన లోపాలను ఇంతవరకు రెవెన్యూ అధికారులు సరిచేయలేక పోయారంటూ పలు గ్రామాల సర్పంచులు రెవెన్యూ అధికారులపై ధ్వజమెత్తారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎంపీపీ భుక్యా శాంతిబాయి అధ్యక్షత వహించారు. సమావేశంలో కోలలపూడి సర్పంచ్ ఎం సతీష్ కుమార్, బొల్ల్లాపల్లి సర్పంచ్ నార్నె సింగారావు, చిమ్మిరిబండ సర్పంచ్ జంపని వీరయ్యలు రీసర్వేలో జరిగిన పొరబాట్లును సరిచేయలేదని, రైతులకు ఇంతవరకు పాస్‌బుక్‌లను ఇవ్వలేదని సమావేశానికి హాజరైన ఆర్‌ఐ అశోక్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన వారికి సమాధానం చెబుతూ ఈ విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకువెళతానన్నారు. అదేవిధంగా పలుగ్రామాలలో విద్యుత్ స్తంభాలు శిథిలదశలో ఉన్నాయని, కరెంటు తీగలు కిందకు వేలాడుతున్నాయని, వాటి గురించి విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 25 లోపు రైతులు ఈ-పంట నమోదు చేయించుకోవాలని, అధికంగా యూరియాను వినియోగించకుండా రైతులకు అవగాహన కలిగించాలని ప్రజా ప్రతినిధులను ఏవో లావణ్య కోరారు. తమ గ్రామంలో బోర్లు మరమ్మతులు చేయడంలేదని బొబ్బేపల్లి ఎంపీ టీసీ సభ్యుడు దండా హరిబాబు సమావేశంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్తగా ప్రభుత్వం సహకారంతో ఇళ్లు నిర్మించుకునేందుకు మండలంలో 827 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మరో రెండు నెలల్లో కొత్తగా ఇళ్లు మంజూరు అయ్యే అవకాశం ఉందని హాసింగ్ ఏఈ రాహుల్ తెలిపారు. అదేవిదంగా మండలంలో ద్రోణాదుల, వలపర్ల హైస్కూల్స్‌లో స్కూల్‌కు అనుసంధానంగా ఇంటర్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో విద్యార్థుల ప్రవేశాలు జరగలేదని ఎంఈవో వస్రాంనాయక్ తెలిపారు. గ్రామాలలో గాలి కుంటువ్యాధులకు పశువులకు టీకాలు వేస్తున్నట్లు మార్టూరు ఏడీఏ తెలిపారు. గ్రామాలలో రెండవ విడత ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రెండవ విడత నిధులు మంజూరయ్యాయని, వాటితో సిమెంటురోడ్లు, సైడు కాల్వలు నిర్మాణం చేపడతామని పీఆర్ ఏఈ శాస్త్రి తెలిపారు. మండలంలో చెరువులు అన్నీ నిండాయని, నీటి కొరత లేదని, ఆర్‌డబ్లుఎస్ ఏఈ బ్రహ్మయ్య తెలిపారు. మహాపోషణ కార్యక్రమం అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీవో సుభద్ర తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో వై.శ్రీనివాసరావు, ఉద్యానాధికారి బి హనుమంతనాయక్, ఏపీఎం లక్ష్మీనారాయణ,మార్టూరు ఈవో తన్నీరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.