మొక్కజొన్న రైతుల్లో కలవరం
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:10 AM
మొంథా తుఫానుతో మండలంలో మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మార్టూరు, అక్టోబరు26 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫానుతో మండలంలో మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షం కన్నా భారీ గాలులు వీచినట్లయితే పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ లో మండలంలో 360 ఎకరాలు మొక్కజొన్న సాగు చేశారు. మూడు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు తాను సాగు చేసిన 7 ఎకరాలు మొక్కజొన్న పంట నేలకు ఆనినట్లు రైతు తన్నీరు శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఇకప్రస్తుతం తుఫాను ప్రభావంతో మరింతగా గాలులుతో కూడిన వర్షం కురిస్తే పంట పూర్తిగా నేలపాలవుతుందని ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం నుండి తుఫాను ప్రభావం వ్యాపించే అవకాశం ఉండడంతో మరింతగా ఈ పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
కూరగాయ పంటలకు నష్టం
మండలంలో కూరగాయల పంటలు సాగుచేసిన రైతులు మూడురోజుల క్రితం కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. మండలంలోని బొల్ల్లాపల్లి, వలపర్లలో 500 ఎకరాల్లో కూరగాయలు సాగయ్యాయి.
యద్దనపూడి మండలంలో
యద్దనపూడి మండలంలో తుఫాను ప్రభావాన్ని ఎదొర్కొనేందుకు మండల అధికారం యంత్రాంగం చర్యలు చేపట్టింది. తహసీల్దారు కే.రవికుమార్, ఎంపీడీవో, విద్యుత్ ఏఈ, ఆర్‌డబ్లుఎస్ అధికారులు ఆదివారం తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పంగులూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫాన్‌గా రూపాంతరం చెందుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రేణంగివరం ఎస్.ఐ.వినోద్‌బాబు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇంటిలోనే ఉండాలని, బయటకు వెళ్ళవద్దని సూచించారు. విద్యుత్ పరికరాల వినియోగం నిలిపివేయడంతో పాటు తాగునీరు, నిత్యావసరాలు ముందుగానే సమ కూర్చుకోవాలన్నారు. చెట్లకింద, విద్యుత్‌తీగల సమీపంలో నిలువరాదని కోరారు. ప్రభుత్వ సూచనలను విధిగా పాటించాలన్నారు.
వాడరేవు(చీరాల) : మొంథా తుఫాన్ ప్రభావంతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, డీఎస్పీ ఎండీ మొయిన్ అన్నారు. ఇప్పటికే వాతావరణశాఖ భారీ తుఫాన్ సూచించిన నేపథ్యంలో వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. ఈక్రమం లోనే ఆదివారం పాయింట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విపత్కర సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై చర్చించారు. వేటకు నిషేదాజ్ఞలు విధించినట్లు చెప్పారు. వారి వెంట డీఎల్ డీవో పద్మావతి, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎస్సై జనార్థన్ ఇతర సిబ్బంది ఉన్నారు.
బల్లికురవ : మొంథా తుపానుపై గ్రామస్థాయి నుంచి మండల స్ధాయి అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వి. వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం తహసీల్ధార్ కార్యాలయంలో మండల స్ధాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేజీబీవీ విద్యాలయం, ప్రాథమిక వైద్యశాలలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా జనరేటర్ సౌకర్యం కల్పించాలన్నారు. అలానే వాగులు వంకలు వచ్చే ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఎవరైన లోతట్టు ప్రాంతంలో ఉంటే వారిని పునరావస కేంద్రాలకు తరించాలన్నారు. మూడు రోజుల పాటు తుపాను ప్రభావం ఉంటుందన్నారు. అన్ని గ్రామాలలో ప్రజలకు దండోరా ద్వారా తుపానుపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులు అందరు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీవో కుసుమకుమారి, డిప్యూటీ తహసీల్దార్ ప్రహర్ష, అర్‌అడబ్యూఎస్, గృహనిర్మాణ శాఖ ఏఈలు, గిరినాయక్, దుర్గాప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బల్లికురవ: మొంథా తుపాను ప్రభావంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికందే సమయంలో తుపాను రావడంతో ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందో అని వారు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో రైతులు దేవుడిపై భారం వేసి పంటల వైపు చూస్తున్నారు. బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి, అంబడిపూడి, గుంటుపల్లి, కొత్తపాలెం, కొమ్మినేనివారి పాలెం, వైదన, ముక్తేశ్వరం గ్రామాలలో రైతులు మొక్కజొన్న, సజ్జ పంటలను సాగు చేశారు. ఇప్పుడు కొందరు రైతులు సాగు చేసిన పంట కోత దశలో ఉండగా కొందరికి కండే దశలో ఉన్నాయి. ఈ సమయంలో భారీ వర్షాలు కురిస్తే పంట చేతికి వచ్చే పరిస్ధితి లేదని రైతులు లబోదిబో మంటున్నారు. అలానే పలు గ్రామాలలో రైతులు పత్తి, మిర్చి బొప్పాయి, కూరగాయాల పంటలను సాగు చేసి ఉన్నారు. ఈ పంటలు కూడా వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరో మూడు రోజుల పాటు రైతులు దినదిన గండంగా పంట పొలాలవైపు చూస్తున్నారు.
తుఫాను షెల్టర్లుగా 18 కేంద్రాల ఏర్పాటు
మార్టూరు : మొంథా తుఫాను ప్రభావంతో మండలంలోని గ్రామాలలో ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం 18 పునరావాస కేంద్రాలను ఎంపిక చేసినట్లు తహసీల్దార్ టి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. మండలంలోని 18 గ్రామ సచివాలయాల పరిధిలో 18 కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. వాటిలో ఆదివారం మార్టూరులోని జడ్పీ హైస్కూల్‌ను మండల ప్రత్యేకాఽ ధికారి బాషా, ఆర్‌ఐ అశోక్‌లు పరిశీలించారు. అదేవిధంగా సోమవారం ఉదయం నుంచి ఈ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. వాటిలో విద్యుత్, తాగునీరు తదితర వసతులను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలి
ఇంకొల్లు : ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ కారణంగా మండల పరిధిలోని అన్నీ గ్రామ పంచాయితీల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులను సైతం అప్రమత్తం చేస్తామన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగుచర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ సిబ్బంది పారిఽశుధ్యం కార్మికులను అప్రమత్తంగా ఉంచామన్నారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, అడ్డగడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అద్దంకి లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అద్దంకి : మొంథా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి పట్టణ ప్రజలకు తుఫాన్ సమయంలో అవసరమైతే 9342929342ను సంప్రదించాలన్నారు.
మొంథా తుఫాన్ నేపద్యంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు తెలిపారు. విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలన్నారు. స్తంభాలు పడినా, విద్యుత్ వైర్లు తెగినా తాకరాదన్నారు. వెంటనే కం ట్రోల్ రూమ్ 9490611613, టోల్‌ఫ్రీ నంబరు 1912 కు సమాచారం అందించాలన్నారు.