Share News

కనిగిరిలో తగ్గని కాపీయింగ్‌ జోరు

ABN , Publish Date - Mar 13 , 2025 | 02:35 AM

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ జోరు తగ్గలేదు. బుధవారం ఒకేరోజు మూడు కేంద్రాల్లో ఎనిమిది మంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారంటే అక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘జోరుగా కాపీయింగ్‌’ శీర్షికన కనిగిరిలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల్లో జరుగుతున్న వ్యవహారంపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.

కనిగిరిలో తగ్గని కాపీయింగ్‌ జోరు

ఒకే రోజు 8మంది డీబార్‌

ఇన్విజిలేటర్లు రిలీవ్‌

ఆ సెంటర్ల అధికారులకు నోటీసులు

ఒంగోలు విద్య. మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ జోరు తగ్గలేదు. బుధవారం ఒకేరోజు మూడు కేంద్రాల్లో ఎనిమిది మంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారంటే అక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘జోరుగా కాపీయింగ్‌’ శీర్షికన కనిగిరిలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల్లో జరుగుతున్న వ్యవహారంపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించి ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ రాష్ట్ర కార్యాలయం నుంచి కోఆర్డినేటర్‌ అక్బర్‌ ఆలీఖాన్‌ బుధవారం కనిగిరిలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కనిగిరిలోని ఏపీ మోడల్‌ స్కూలు పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని, సెయింట్‌ జోసఫ్‌ ఇంగ్లీషు మీడియం హైస్కూలు కేంద్రంలో ఇద్దరిని, కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకరిని పట్టుకుని రాష్ట్ర కోఆర్డినేటర్‌ అక్బర్‌ ఆలీఖాన్‌ డీబార్‌ చేశారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ పరీక్ష హాలులో ఇన్విజిలేటర్లుగా పనిచేస్తున్న టీచర్లందరినీ పరీక్షల విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

పలువురికి తాఖీదులు

కనిగిరిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఎనిమిది మంది విద్యార్థులు డీబార్‌ కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. రాష్ట్ర అధికారి పట్టుకోవడం, ఇక్కడి అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పరీక్షల నిర్వహణలో డొల్లతనాన్ని ఎత్తిచూపింది. ఈ మూడు పరీక్షా కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, పర్యవేక్షక అధికారులందరికీ సంజాయిషీ నోటీసులు జారీ చేస్తున్నట్లు డీఈవో కిరణ్‌కుమార్‌ తెలిపారు. కనిగిరిలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో మూడింటిలో విద్యార్థులు డీబార్‌ అయ్యారు. గణితం, హిస్టరీ పరీక్షకు 663 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. గణితంలో 1,927 మందికి 1,319 మంది, హిస్టరీలో 235 మందికి 180 మంది, అకౌంటెన్స్‌ పరీక్షకు ఒక్కరు హాజరయ్యారని కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు 21, ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాధికారులు ఐదేసి కేంద్రాలను సందర్శించారు.

Updated Date - Mar 13 , 2025 | 02:35 AM