Share News

సహాయక చర్యల్లో సమన్వయం

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:08 AM

మొంథా ధాటికి జిల్లా ప్రజానీకం వణికిపోయినప్పటికీ గతంలో సంభవించిన తుఫాన్లతో పోల్చితే తక్కువ నష్టంతో బయటపడగలిగారు. అందుకు అటు జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో నడిపించడంలో కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజులు ప్రత్యేక చొరవచూపారు.

సహాయక చర్యల్లో సమన్వయం
ఒంగోలులోని నవోదయ వద్ద చర్చించుకుంటున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యే జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు

తొలినుంచి ఒకటిగా సాగిన అధికారులు, ప్రజాప్రతినిధులు

ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిన కలెక్టర్‌, ఎస్పీ

స్థానికంగా పర్యవేక్షణలో కీలకప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు

ప్రభుత్వ అప్రమత్తత, సామాజిక మాధ్యమాలతో ప్రజల్లోనూ చైతన్యం

కుంభవృష్టిగా వాన కురిసినా ప్రాణ నష్టం లేకుండా బయటపడిన జిల్లా

ఒంగోలు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా ధాటికి జిల్లా ప్రజానీకం వణికిపోయినప్పటికీ గతంలో సంభవించిన తుఫాన్లతో పోల్చితే తక్కువ నష్టంతో బయటపడగలిగారు. అందుకు అటు జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో నడిపించడంలో కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజులు ప్రత్యేక చొరవచూపారు. వారికి నిత్యం అందుబాటులో ఉంటూ మంత్రి డాక్టర్‌ స్వామి, ఇతర కీలక ప్రజాప్రతి నిధులు అందించిన సహకారం కలిసొచ్చింది. అంతకు మించి రాష్ట్రప్రభుత్వం నుంచి నేరుగా లక్షలాది మందికి తుఫాన్‌ తీవ్రతపై నిరంతరం అలర్టు, సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా అవసరమైన సమాచారాన్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రజల్లో పెరిగిన చైతన్యం కూడా కారణమని చెప్పాలి. నిజానికి మొంథా తీవ్రత జిల్లాపై తీవ్రంగానే ఉంది. ఒకరకంగా తుఫాన్‌ జిల్లాలోనే తీరం దాటిందా.. అన్నంత స్థాయిలో కుండపోత వర్షం కురవడంతోపాటు మంగళవారం రాత్రి గాలులు వీచాయి. కేవలం 36 గంటల్లోనే 18సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. దీంతో వందలాది గ్రామాలు, పట్టణాల్లో కాలనీలు జలమయంతోపాటు దాదాపు 50కిపైగా వాగులు, వంకలు పొంగి ప్రవహించి కీలక మార్గాల్లో రవాణా నిలిచిపోయింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి.

అప్రమత్తతతో తగ్గిన నష్టాలు

సాధారణంగా ఈస్థాయి తుఫాన్‌తో ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా ఉంటుంది. ఈసారి అనివార్యంగా జరిగే పంట నష్టాలు, ఇతర వనరుల నష్టాలు తప్ప ప్రాణనష్టం అన్నది ఎక్కడా లేకపోగా వ్యక్తిగతంగా ఆస్తినష్టాలు చాలా తక్కువగా ఉన్నాయి. తుఫాన్‌ రాకపై మూడు రోజుల ముందు నుంచే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ముందస్తు ప్రణాళికతో కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజు వ్యవహరించారు. సచివాలయ స్థాయి వరకు అన్నిశాఖల సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు తుఫాన్‌ గమనం, వర్షాలు పడే ప్రాంతాలు, ఎదురయ్యే తీవ్ర సమస్యలు, ఇబ్బందులను అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు తీసుకొని సమన్వయంతో సాగారు. తుఫాన్‌ ప్రభావం ప్రారంభమై జోరువాన కురుస్తున్న సమయంలో రాత్రింబవళ్లు మొత్తం జిల్లా పరిస్థితిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో చర్యలపై కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ స్వయంగా తాము కూడా వెళ్లి పర్యవేక్షించారు. జిల్లాకు నియమితులైన ప్రత్యేక అధికారులు సిసోడియా, కోన శశిధర్‌ల మార్గదర్శనం కూడా వారికి లాభించింది. వర్షం వెలిశాక పునరావాస శిబిరాల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, నీటి వనరుల సంరక్షణ కూడా జాగ్రత్తగానే చేశారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు తుఫాన్‌ ముందు నుంచే యంత్రాంగంతో సమన్వయంగా సాగి తమ, తమ ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలలో సఫలమయ్యారు. బుధవారం సహాయక చర్యల్లోనూ అలాగే వ్యవహరించారు. మంత్రి డాక్టర్‌ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి కందుల నారాయణరెడ్డి, ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబులు తమతమ ప్రాంతాల్లో అధికారులతో సమన్వయంగాను, విడిగా పార్టీ నేతల ద్వారా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తంగా మొంథా తుఫాన్‌ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపినా అవకాశం ఉన్నమేర నష్ట తీవ్రతను తగ్గించడంలో సక్సెస్‌ అయ్యారు.

Updated Date - Oct 30 , 2025 | 02:08 AM