Share News

వైద్యశాఖలో వివాదం

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:35 AM

జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. హాజరు పట్టికలో సంతకం విషయమై నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఇరువురు ఉద్యోగుల మధ్య రగడ చోటుచేసుకుంది. ఒక ఉద్యోగి కార్యాలయానికి ఆలస్యంగా వచ్చారన్న కారణంతో మరో ఉద్యోగి సీఎల్‌ వేయడంతో వివాదం మొదలైంది.

వైద్యశాఖలో వివాదం
వైద్యారోగ్యశాఖ కార్యాలయం

హాజరు విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ

కార్యాలయంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదం

ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఒకరిపై మరొకరు ఆరోపణ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. హాజరు పట్టికలో సంతకం విషయమై నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఇరువురు ఉద్యోగుల మధ్య రగడ చోటుచేసుకుంది. ఒక ఉద్యోగి కార్యాలయానికి ఆలస్యంగా వచ్చారన్న కారణంతో మరో ఉద్యోగి సీఎల్‌ వేయడంతో వివాదం మొదలైంది. వివరాల్లోకి వెళితే.. ఒక ఉద్యోగి సోమవారం కార్యాలయానికి వచ్చి పనిమీద బయటకు వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆ ఉద్యోగి వచ్చాడని తెలిసి కూడా హాజరుపట్టికలో సంతకం చేయలేదనే కారణంతో మరో ఉద్యోగి సీఎల్‌ వేసినట్లు సమా చారం. ఈ విషయాన్ని గుర్తించిన సదరు ఉద్యోగి తాను కార్యాలయానికి వచ్చినా హాజరు పట్టికలో సీఎల్‌ ఎలా వేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఇరువురు ఉద్యోగుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చేసుకొంది. కార్యాలయం దద్దరిల్లే విధంగా అరుపులు, కేకలతో మోతపుట్టించారు. సాధారణంగా ఉద్యోగుల హాజరుపట్టిక డీఎంహెచ్‌వో చాంబర్‌లో ఉండేది. దాన్ని ఇప్పుడు ఒక ఉద్యోగికి ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా వైద్యశాఖకు ముఖహాజరును అమలులో ఉంది. ప్రతి ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన వెంటనే ముఖహాజరు వేస్తుంటారు. మరలా కార్యాలయంలో ఉండే హాజరుపట్టికలో సంతకాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం కార్యాలయంలో ఆ ఉద్యోగి వద్ద హాజరుపట్టికను ఎందుకు ఉంచారన్నది కూడా తేలాల్చి ఉంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారి జోక్యం చేసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ఆ శాఖ పరువు బజారునపడే అవకాశం ఉందని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 01:35 AM