Share News

ప్రకాశంలోనే కొనసాగించాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:17 AM

ముండ్లమూరు, తాళ్లూరు మండలాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించే విధంగా చూడాలని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాలను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను అందజేశారు.

ప్రకాశంలోనే కొనసాగించాలి
ఎంపీ మాగుంటకు వినతిపత్రం అందజేస్తున్న తాళ్లూరు, ముండ్లమూరు మండలాల నాయకులు

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల నేతల విజ్ఞప్తి

ఎంపీ మాగుంట, కలెక్టర్‌ అన్సారియాను కలిసి వినతిపత్రాలు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): ముండ్లమూరు, తాళ్లూరు మండలాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించే విధంగా చూడాలని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాలను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఉమ్మడి జిల్లా మూడు ముక్కలైందన్నారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వినతులు వచ్చినా పట్టించు కోలేదన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. దర్శి నియోజకవర్గాన్ని కలుపుకొని మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు. అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటును తాళ్లూరు, ముండ్లమూరు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులుగా తామూ స్వాగతిస్తున్నా మన్నారు. మార్కాపురం జిల్లాలో ఈ రెండు మండలాలను విలీనం చేయడం వలన తాము 90 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ఈ రెండు మండలాలను ప్రస్తుతం ఉన్న ఒంగోలు కేంద్రంగానే కొనసాగించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టీడీపీ ముండ్లమూరు, తాళ్లూరు మండలాల అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, రైతు నాయకులు జి.రంగనాయకులు, మేదరమెట్ల వెంకట్రావు, చావా బ్రహ్మయ్య, నిడమానూరు శ్రీనివాసరావు, రాచకొండ వెంకట్రావు, పిన్నిక రమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:17 AM