Share News

‘ఉపాధి’ నిధులతో నీటితొట్ల నిర్మాణాలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 10:51 PM

వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో గ్రామాల్లో చెరువులు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేక ఎండిపోయాయి. పశువులకు తాగునీరులేక దాహార్తితో అలమటిస్తున్నాయి. వీటి దాహార్తి తీర్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హమీ పథకం నిధులతో నిర్మాణాలు చేపట్టారు.

‘ఉపాధి’ నిధులతో నీటితొట్ల నిర్మాణాలు
ఇండ్లచెరువులో నీటితొట్టి వద్ద దాహార్తి తీర్చుకుంటున్న మూగజీవాలు

దొనకొండ, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో గ్రామాల్లో చెరువులు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేక ఎండిపోయాయి. పశువులకు తాగునీరులేక దాహార్తితో అలమటిస్తున్నాయి. వీటి దాహార్తి తీర్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హమీ పథకం నిధులతో నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో పశువుల సంఖ్య ఆధారంగా నీటితొట్ల నిర్మాణాలు జరి గేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మండలంలో 38 నీటితొట్లు మంజూరుకాగా ఇప్పటికే 31 పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో నీటి తొట్టి దాదాపు 5వేల లీటర్ల సామర్థ్యంతో, రూ.44 వేల ఖర్చుతో నిర్మిస్తున్నారు. పలు గ్రామాల్లో బోర్లు ఉన్న ప్రాంతాల్లో వాటిపక్కనే గొర్రెలు, మేకలకు నీరందే విధంగా, అవులు, గేదెలకు నీరందేలా పెద్దది, చిన్నది రెండు నీటితొట్లు నిర్మాణాలు జరిపారు. బోరులేని గ్రామాల్లోని నీటితొట్లకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ట్యాంకర్లతో నీటిని నింపే బాధ్యతను అప్పగించారు.

మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో ఎద్దులు, ఆవులు 1648, గేదెలు 16524, గొర్రెలు 29879, మేకలు 3762 ఉన్నట్లు అధికారుల సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మూగజీవాల దాహార్తి సమస్యను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో పశువుల దప్పిక తీర్చటానికి అప్పట్లో నీటితొట్లను నిర్మించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిగురించి ఏమాత్రం పట్టించు కోకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయని పలువురు పశుపోషకులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీటి నిర్మాణాలు చేపట్టడంతో పశుపోషకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 10:51 PM