అటు వెలిగొండ, ఇటు మెడికల్ కాలేజీ నిర్మాణం.. ప్రజల చెవిలో పూలు పెట్టిన జగన్
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:42 PM
అటు వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారు.. ఇటు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తికాకుండానే చేశామని వైసీపీ అధినేత జగన్ చెప్పి ప్రశ్చిమ ప్రాంత ప్రజల చెవుల్లో మరోమారు పూలు పెట్టారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.
పశ్చిమవాసులకు అన్యాయం చేసిన వైసీపీ
సుమారు 15లక్షలకుగాను కేవలం 3 లక్షల 60వేల చదరపు అడుగులే నిర్మాణం
త్వరలో ప్రారంభించి మెరుగైన వైద్యం అందిస్తాం
2026కి వెలిగొండను పూర్తి చేస్తాం
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం రూరల్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : అటు వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారు.. ఇటు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తికాకుండానే చేశామని వైసీపీ అధినేత జగన్ చెప్పి ప్రశ్చిమ ప్రాంత ప్రజల చెవుల్లో మరోమారు పూలు పెట్టారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని రాయవరం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. మెడికల్ కాలేజీ నిర్మాణంపై వైసీపీ నాయకులు ప్రజలకు అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. గత వైసీపీ పాలనలో 14లక్షల85వేల అడుగుల భవనాలను నిర్మించాల్సి ఉండగా, కేవలం 3 లక్షల 60వేల చదరపు అడుగులు మాత్రమే పూర్తి చేసి మెడికల్ కాలేజీని పూర్తి చేశామని ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. మెడికల్ కాలేజీలో కీలకమైన అనాటమీ, పిజియాలజీ, బయో కెమిస్ర్టీ ల్యాబ్‌ల బిల్డింగ్‌లు పూర్తి కాలేదన్నారు. 2024 జూన్‌లో నేషనల్ కౌన్సిల్ ప్రతినిధులు ఈ కాలేజీని సందర్శించి నవ్వి ఇక్కడ ఏమి నిర్మాణాలు ఉన్నాయని తరగతులు ప్రారంభించాలని ప్రశ్నించి వెళ్లిపోయారని కందుల గుర్తు చేశారు. అప్పట్లో 17 మెడకల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,450కోట్లు అంచనాలు వేసిన వైసీపీ కేవలం రూ.1,350కోట్లు మాత్రమే ఇచ్చిందని, వాటి నిర్మాణం కోసం తీసుకున్న రూ.13వేల కోట్ల రుణం ఏం చేసిందో చెప్పాలని కందుల ప్రశ్నించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రారంభించిన జగన్‌రెడ్డి మోసాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇటు మెడికల్ కాలేజీ, అటు వెలిగొండ విషయంలో జగన్‌రెడ్డి ప్రజల చెవిలో పూలు పెట్టారని కందుల అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలను ఏడాదిలో పూర్తి చేసి పశ్చిమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తామని కందుల స్పష్టం చేశారు. అలాగే 2026 వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి చేస్తారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా, మెడికల్ కాలేజీ, వెలిగొండను పూర్తి చేస్తామని కందుల తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు కందుల రామిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసులు, మార్కాపురం సొసైటీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, టీడీపీ నాయకులు వక్కడగడ్డ మల్లికార్జున, మౌలాలి, హర్షిత బాబి, బీజేపీ నాయకులు కృష్ణారావు పాల్గొన్నారు.