అర్ధంతరంగా ఆగిన రైతుబజార్ నిర్మాణం
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:08 PM
రైతుల ప్రయోజనం కోసం మార్కెటింగ్ శాఖ నిధులతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణం మధ్యలో నిలచిపోయింది. ఏళ్ల తరబడి మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి.
గత వైసీపీ పాలకుల అసమర్ధతే ప్రధాన కారణం
కూటమి ప్రభుత్వం రాకతో కదలిక
దర్శి, అక్టోబరు 5(ఆంద్రజ్యోతి): రైతుల ప్రయోజనం కోసం మార్కెటింగ్ శాఖ నిధులతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణం మధ్యలో నిలచిపోయింది. ఏళ్ల తరబడి మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. వైసీపీ పాలకుల అసమర్ధతతో దర్శి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకాలు మూలనపడిన విషయం తెలిసిందే. రైతుబజారు కూడా గోడల స్టేజీలో నిలిచిపోయింది.
గత ప్రభుత్వం హయాంలో రూ.60 లక్షలతో 40 షాపులు నిర్మించే విధంగా నిర్మాణం చేపట్టారు. ఒక కాంట్రాక్టర్ టెండర్ ద్వారా పనులు దక్కించుకోగా, మరో వైసీపీ నాయకుడు ఆ పనిని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అరకొరగా పనులు చేసి బిల్లులు చేసుకోవచ్చనే ఉద్దేఽశంతో కొంతమేర పనులు చేశాడు. అధికారులపై ఒత్తిడి తెచ్చి రూ.25 లక్షలకు పార్టు బిల్లును తయారుచేయించి పంపారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం నిధులను పక్కదారి మళ్లించటంతో పార్టు బిల్లు నిధులు మంజూరు కాలేదు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. వైసీపీ ప్రభుత్వంలో అలాగే నిలిచిపోయింది.
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టు బిల్లు కోసం ప్రయత్నించారు. నాసిరకంగా పనులు చేశారనే విమర్శలు రావటంతో అధికారులు బిల్లు మంజూరు చేయలేదు. ఇప్పటికీ రైతుబజార్ నిర్మాణం అలాగే మధ్యలో నిలిచిపోయింది. పునాదులు కూడా సక్రమంగా వేయకపోవటంతో ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపునీరు రైతు బజార్ నిర్మాణం చుట్టూ చేరింది. రోజులు తరబడి పునాదుల చుట్టూ నీరు నిల్వ ఉండటంతో దెబ్బతినే ప్రమాదం నెలకొంది. సంబంధిత అధికారులు రైతుబజార్ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. నిల్వఉన్న నీటిని కూడా పక్కకు మళ్లించే ప్రయత్నం చేయలేదు. దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో అనేకమంది రైతులు పండ్లు, పూలు, కూరగాయలు పండిస్తారు. వారు పండించిన పంటలను రైతుబజార్‌లో గిట్టుబాటు ధరకు విక్రయించుకునేందుకు ప్రారంభించిన రైతుబజార్ మద్యలో నిలచిపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను గుర్తించి కూటమి ప్రభుత్వం నిలిచిన రైతుబజార్ నిర్మాణం పూర్తిచేసి, అక్కడ మార్కెట్ ఏర్పాటుకు వనరులు కల్పించాలని కోరుతున్నారు.