ప్రయాసగా మారిన ఫాం పాండ్ల నిర్మాణం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:22 AM
: ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో తలపెట్టిన ఫాం పాండ్ల నిర్మాణపనులు చీమకుర్తి మండలంలో మందకొడిగా సాగుతున్నాయి. రైతుల్లో అవగాహన లేమి, వారికి అవగాహన కల్పించటంలో అధికారుల వైఫల్యం వెరసి లక్ష్యసాధనలో వెనుకబాటుతనం వెంటాడుతోంది. రాష్ట్ర స్థాయి అధికారి ప్రత్యేకంగా మండలాన్ని విజిట్ చేసి పొలాల్లో నీటికుంటల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవటం గమనార్హం.
అవగాహన లేక నిరాకరిస్తున్న రైతులు
లక్ష్యసాధనలో చీమకుర్తి మండలం వెనుకబాటు
రాష్ట్ర అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినా ముందుకు కదలని అధికారులు
చీమకుర్తి, జూన్ 3(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో తలపెట్టిన ఫాం పాండ్ల నిర్మాణపనులు చీమకుర్తి మండలంలో మందకొడిగా సాగుతున్నాయి. రైతుల్లో అవగాహన లేమి, వారికి అవగాహన కల్పించటంలో అధికారుల వైఫల్యం వెరసి లక్ష్యసాధనలో వెనుకబాటుతనం వెంటాడుతోంది. రాష్ట్ర స్థాయి అధికారి ప్రత్యేకంగా మండలాన్ని విజిట్ చేసి పొలాల్లో నీటికుంటల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవటం గమనార్హం.
చీమకుర్తి మండలానికి 314 ఫారం పాండ్లను మంజూరయ్యాయి. వాటిల్లో ఇప్పటివరకు కేవలం 36 మాత్రమే పూర్తయ్యాయి. మరో 61 నిర్మాణదశలో ఉన్నాయి. మిగతా వాటి పరిస్థితి అగమ్మగోచరంగా ఉంది. వాటిని నిర్ణీత కాలంలోపు పూర్తిచేయటం దుర్లభంగా మారింది. నిర్మాణాలలో వెనుకబాటుతనానికి ప్రధాన కారణం రైతులు నిరాసక్తత ప్రదర్శించటమే కనిపిస్తోంది. ఐదెకరాలలోపు పొలం ఉన్న రైతుల పొలాల్లో మాత్రమే కుంటల నిర్మాణం చేపట్టాలని నిబంధన ఉండటం, తమకున్న కొద్దిపాటి పొలంలో కుంటలు నిర్మిస్తే ఎలా అంటూ వారు వెనకడుగు వేస్తున్నారు. రైతుల ఇష్టం లేకుండా నిర్మాణం చేపట్టలేని పరిస్థితి. ఫాం పాండ్స్ నిర్మాణం వలన కలిగే ప్రయోజనాలతో పోలిస్తే పంట సాగు విస్తీర్ణం తగ్గినా నష్టం లేదన్న విషయాన్ని రైతులకు కూలంకుషంగా అవగాహన కల్పించి నిర్మాణాల లక్ష్యసాధన వైపు అధికారులు అడుగులు వేయాల్సి ఉంది.
మండలంలోని బూదవాడ తదితర ప్రాంతాల్లో కొంతమేర తవ్వకాలు చేశాక రాయి తగిలి నిర్ధేశించిన లోతు కూలీలు తవ్వలేకపోతుండలేకపోవటం కూడా సమస్యగా మారింది. దీంతో నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఉపాధి కూలీలు కూడా కుంటల తవ్వకాలకు పెద్దగా ఆసక్తి చూపకపోవటం కూడా మరో కారణం. ఇటీవల రాష్ట్ర చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపినాథ్, డ్వామా పీడీ, ఏపీడీ, మండల అధికారులతో కలిసి మండలంలోని మంచికలపాడు, మువ్వావారిపాలెం గ్రామాల్లో ఫారం పాండ్ల నిర్మాణాలను పరిశీలించారు. లక్ష్యసాధనలో బాగా వెనుకబడి ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత సమయంలో లక్ష్యం విధించిన నిర్మాణాలను పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో కుంటల నిర్మాణాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి లక్ష్యసాధనవైపు అడుగులు వేగంగా వేయాల్సిన అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపొందించి, గ్రామాల్లో రైతులకు నచ్చచెప్పి, కుంటల వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
అవరోధాలను అధిగమిస్తున్నాం
రాఘవ, ఏపీవో, చీమకుర్తి
మండలంలో ఫాం పాండ్ల నిర్మాణంలో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయటంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా గ్రామాల్లో రాయి పడి తవ్వకాలు ముందుకుపోక అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. ఉన్నతాధికారుల మార్గ నిర్ధేశకత్వంలో నిర్మాణాలను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం.