పీఎస్ హెచ్‌ఎంల బదిలీల్లో గందరగోళం
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:49 AM
ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా (పీఎస్ హెచ్‌ఎం) స్కూలు అసిస్టెంట్ల నియామకంలో గందరగోళం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఒకే స్థానాన్ని ఇద్దరు హెచ్‌ఎంలకు కేటాయించడంతో వారు లబోదిబోమంటున్నారు.
404 మంది ఎస్‌ఏలకు ఉద్యోగోన్నతి
ఒకస్థానం ఇద్దరికి కేటాయింపు
సాంకేతిక సమస్యలతో సతమతం
ఒంగోలు విద్య, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా (పీఎస్ హెచ్‌ఎం) స్కూలు అసిస్టెంట్ల నియామకంలో గందరగోళం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఒకే స్థానాన్ని ఇద్దరు హెచ్‌ఎంలకు కేటాయించడంతో వారు లబోదిబోమంటున్నారు. 509 మంది స్కూలు అసిస్టెంట్లను పీఎస్ హెచ్‌ఎంలుగా నియమించాల్సి ఉండగా 404మందిని మాత్రమే నియమించారు. కొందరు టీచర్లకు తప్పనిసరి బదిలీ లేనప్పటికీ ఆ స్థానాలు ఖాళీలుగా చూపిస్తుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. పీఎస్ హెచ్‌ఎంలుగా 509మంది స్కూలు అసిస్టెంట్లను నియమించాల్సి ఉండగా 404 మందిని మాత్రమే నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో 105 పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మిగులుగా తేలిన 509 మంది స్కూలు అసిస్టెంట్లను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు హెచ్‌ఎంలుగా నియమించాలని నిర్ణయించింది. మిగులు టీచర్ల సంఖ్య ప్రామాణికంగా సబ్జెక్టు వారీగా స్కూలు అసిస్టెంట్ మిగులు తెలుగు 115 మంది, గణితం 134 మంది, ఇంగ్లీషు 139 మంది, హిందీ 23 మంది, సోషల్ 90 మంది, బయోలాజికల్ సైన్స్ ముగ్గురు, సంస్కృతం ముగ్గురు పీఎస్‌హెచ్‌ఎంలుగా నియమితులు కావాల్సి ఉంది. అయితే స్కూలు అసిస్టెంట్ తెలుగు 87మంది, హిందీ 28 మంది, ఇంగ్లీషు 120మంది, గణితం 133మంది, బయాలాజికల్ సైన్స్ ముగ్గురు, సోషల్ 38మంది కలిపి మొత్తం 404 మంది మాత్రమే నియమితులయ్యారు. బదిలీల సాఫ్ట్‌వేర్‌లో తలెత్తుతున్న లోపాలతో టీచర్లకు తిప్పలు తప్పడం లేదు. పీఎస్ హెచ్‌ఎం పోస్టు భర్తీ అయినా అది ఖాళీగానే కనిపిస్తుండటంతో టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. ఉదాహరణకు కందుకూరులోని ఇస్కాల వారి వీధిలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై ఒక ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం కోరుకొని చేరిపోయారు. అయినప్పటికీ బదిలీల జాబితాలో ఆ స్థానం ఖాళీగా కనిపించడంతో గుడ్లూరు మండలానికి చెందిన ఒక గణితం స్కూలు అసిస్టెంట్ కోరుకోవడంతో దానిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తీరా విచారిస్తే ఆ స్థానం ఖాళీ లేదని తేలింది. దీంతో ఆ టీచర్ డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇలాగే మరికొందరి స్థానాలు కూడా భర్తీ అయినవి ఖాళీలుగా రిపీట్ కావడంతో ఐటీసెల్ సిబ్బంది గుర్తించి వాటిని తొలగించారు.
తప్పనిసరి బదిలీ కాకపోయినా స్థానం ఖాళీ
తప్పనిసరి బదిలీలో లేకపోయినా తన స్థానాన్ని ఖాళీగా చూపిస్తుండటంతో ఒక టీచర్ ఆందోళన చెందుతూ ఒంగోలుకు పరుగులు తీశారు. కురిచేడు మండలం దేకనకొండ హైస్కూల్ తెలుగు స్కూలు అసిస్టెంట్ స్థానం ఖాళీగా చూపిస్తుండటంతో ఆ పోస్టులో పనిచేస్తున్న టీచర్ ఆందోళన చెందుతున్నారు. ఆ పాఠశాలలో ఎస్‌ఏ తెలుగు ఒక పోస్టు మాత్రమే ఉంది. ఆ టీచర్ బదిలీకి దరఖాస్తు చేయలేదు. మిగులుగా గుర్తించినట్లు చెప్పలేదు. అయితే బదిలీకి దరఖాస్తు చేసుకోలేదు. అయినా ఆస్థానం ఖాళీగా చూపించడంతో ఆమె ఆందోళన చెందుతున్నారు. బదిలీ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడే చేరొద్దు : కమిషనర్
ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా నియమితులైన స్కూలు అసిస్టెంట్లు ప్రస్తుతం వెంటనే విధుల్లో చేరవద్దని కమిషనర్ ఆదేశించారు. స్కూలు అసిస్టెంట్లు, పీఎస్‌హెచ్‌ఎం/ఎస్‌ఏలకు భవిష్యత్‌లో బదిలీల సీనియారిటీ వివాదం రాకుండా ఈ ఇద్దరికీ ఒకే జాయినింగ్ తేదీ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. తదుపరి తాము ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే విధుల్లో చేరాలని కమిషనర్ ఆదేశించారు.