గందరగోళమే!
ABN , Publish Date - May 19 , 2025 | 01:38 AM
జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఫ్రీహోల్డ్‌లో పెట్టిన భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం నెలల తరబడి తాత్సారం చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.
ఫ్రీ హోల్డ్ భూములపై ఎటూతేల్చని ప్రభుత్వం
గత వైసీపీ హయాంలో అడ్డగోలుగా నిర్ణయాలు
వేలాది ఎకరాలను లాగేసుకున్న ఆపార్టీ నేతలు
రిజిస్ట్రేషన్‌లపై నిషేధం విధించిన ప్రస్తుత ప్రభుత్వం
సమస్య పరిష్కారంపై స్పష్టత ఉన్నా నెలల తరబడి వాయిదాలు
ఆందోళనలో రైతులు
ఒంగోలు కలెక్టరేట్, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఫ్రీహోల్డ్‌లో పెట్టిన భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం నెలల తరబడి తాత్సారం చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇస్తూ జిల్లాల్లో ఫ్రీహోల్డ్ చేసుకున్న భూములన్నింటినీ నిగ్గుతేల్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో తదనుగుణంగా చర్యలు మొదలయ్యాయి. అలా విభజిత జిల్లాలో ఫ్రీహోల్డ్‌లో లక్షా 36వేల 421 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించారు. నెలలు గడిచినా వాటిని ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదు. తాజాగా ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయాన్ని మరో రెండు నెలలపాటు వాయిదా వేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని కారణంగా చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పశ్చిమ ప్రాంతంలో అధికం
గత వైసీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు వీలుగా అడ్డగోలుగా నిర్ణయాలను తీసుకుంది. అనేక ప్రాంతాల్లో వివాదాస్పద, అనువంశిక భూములను నిషేధిత జాబితాల నుంచి బయటకు తీసి వేలాది ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసింది. అలాంటివి పశ్చిమప్రాంతంలోని మండలాల్లో అధికంగా ఉన్నాయి. ఇలా నిషేధ జాబితా నుంచి బయటకు వచ్చిన భూములన్నింటినీ వైసీపీ నాయకులు లాగేసుకున్నారు. వాటిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. ఆ భూముల్లో కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. తొలుత రెండు నెలలపాటు నిషేధం అని చెప్పిన పొడిగిస్తూ పోతోంది. ప్రస్తుతం కూడా ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరో రెండు నెలలపాటు అంటే జూలై 11 వరకు పొడిగించింది. ఇలా ప్రభుత్వం పొడిగిస్తూ పోతుండటంతో భూములు కోల్పోయిన రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. వారిలో అనేక సందేహాలువ్యక్తమవుతున్నాయి.