మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
ABN , Publish Date - May 13 , 2025 | 02:10 AM
మార్కాపురం మునిసి పల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అందజేశారు. ఉదయం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు అందరూ కలిసి వాహనాల్లో ఒంగోలు తరలి వెళ్లారు.
కలెక్టర్‌కు నోటీసు అందించిన టీడీపీ మార్కాపురం కౌన్సిలర్లు
మంత్రులను కలిసి పరిస్థితిని వివరించిన ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, మే 12 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం మునిసి పల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అందజేశారు. ఉదయం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు అందరూ కలిసి వాహనాల్లో ఒంగోలు తరలి వెళ్లారు. అక్కడ తొలుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునిసిపాలిటీలో చోటుచేసుకున్న తాజా పరిస్థితులను వారికి వివరించారు. పట్టణం అభివృద్ధి దృష్ట్యా వైసీపీ పాలకవర్గాన్ని మార్చాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం ప్రకాశం భవన్‌కు చేరుకుని అక్కడ డీఆర్సీ సమావేశానికి వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అవిశ్వాస నోటీసును ఎమ్మెల్యే నారాయణరెడ్డితో కలిసి 17 మంది కౌన్సిలర్లు అందజేశారు. అన్ని ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించి అవిశ్వాసంపై తేదీని ప్రకటిస్తామని వారికి కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, మయూరి ఖాశిం, 17 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.