Share News

వెబ్‌ కౌన్సెలింగ్‌పై ఎస్జీటీల్లో ఆందోళన

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:26 AM

బదిలీల్లో సెకండరీ గ్రేడ్‌లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం అమలుపై టీచర్లు భగ్గుమంటున్నారు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అయితే వెబ్‌ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం మొండిగా ముందుకుపోతోంది.

వెబ్‌ కౌన్సెలింగ్‌పై ఎస్జీటీల్లో ఆందోళన

ఎక్కడికిపోతామోనని భయం

ఒంగోలు విద్య జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : బదిలీల్లో సెకండరీ గ్రేడ్‌లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం అమలుపై టీచర్లు భగ్గుమంటున్నారు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అయితే వెబ్‌ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం మొండిగా ముందుకుపోతోంది. వేలాది మంది ఎస్జీటీలు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన నేపథ్యంలో వారు కోరుకునే స్థానాలకు ఆప్షన్లు కూడా భారీగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్‌ కౌన్సెలింగ్‌ అయితే ఏస్థానం వస్తుందో ఎక్కడికి పోవాల్సి వస్తోందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. వందలు, వేల సంఖ్యలో స్థానాలకు ఆప్షన్లు పెట్టుకోవడం కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ అయితే కళ్ల ముందు కనిపించే స్థానాలను కోరుకోవచ్చని టీచర్లు ఆశపడుతున్నారు. అయితే వారికి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. దీనిపై టీచర్లు పోరుబాట పట్టగా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపడతారని పేర్కొన్నందున దాని నుంచి వెనక్కు వచ్చేది లేదని అధికారులు చెప్తున్నారు.

జిల్లాలో 3,146 ఖాళీలు

జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీలకు 3,146 ఖాళీలు చూపిస్తున్నారు. బదిలీల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లే సింహభాగం. 3,531 మంది బదిలీ కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 2,438 మంది తప్పనిసరి బదిలీ వారు కాగా 1,093 మంది అభ్యర్థన మేరకు బదలీ కోసం దరఖాస్తు చేశారు. జిల్లాలో సుమారు మూడు వేల మందికిపైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్థానచలనం కలగనుంది.

తుది సీనియారిటీ జాబితా విడుదల

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల తుది సీనియారిటీ జాబితా విడుదలైంది. దీంతో వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని టీచర్లను అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఏ టీచర్‌కు ఇబ్బంది కలగకుండా ఆప్షన్లు పెట్టించమని డీఈవో, ఎంఈవోలను కమిషనర్‌ ఆదేశించారు. అవసరమైనన్ని ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల విద్యావనరుల కేంద్రాల్లో కూడా తగినన్ని ల్యాప్‌టాప్‌లు ఏర్పాటు చేసి కంప్యూటర్‌ పరిజ్ఞానం తెలిసిన టీచర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బదిలీల ఆప్షన్లు పెట్టుకునేందుకు గడువు మంగళవారంతో ముగియనుండటంతో ఎప్పుడు పెట్టుకోవాలని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌లో సులభంగా ఆప్షన్లు పెట్టుకునేందుకు వీలుగా కమిషనర్‌ స్లాట్‌ విధానాన్ని ప్రతిపాదించారు. ప్రతి 500 మందికి ఒక స్థానం కేటాయిస్తారు. ఆప్షన్లు పెట్టుకున్న వారి బదిలీ ఉత్తర్వులు జనరేట్‌ చేసి వారికి కేటాయించిన స్థానాలు పోను మిగిలిన వాటికి తర్వాత స్లాట్‌ వారికి చూపిస్తారు. ఈ విధానాన్ని అమలు చేస్తామని కమిషనర్‌ సంఘాల నాయకులకు చెప్పారు. ఈ ప్రతిపాదనను నాయకులు అంగీకరించకుండా మాన్యువల్‌ విధానం కోసం పట్టుబట్టారు.

వెబ్‌ అప్షన్లు ప్రారంభం

ఎస్జీటీలకు ఆప్షన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. కమిషనర్‌ ప్రతిపాదన ప్రకారం మొదట శ్లాబులోని 500 మందికి మాత్రమే ఖాళీలు ఓపెన్‌ కావాల్సి ఉండగా అందరికి ఓపెన్‌ అవుతున్నాయి. అంటే శ్లాబ్‌ ప్రతిపాదన అటకెక్కినట్లు అయింది. దీంతో బదిలీ సీనియారిటీ జాబితాలోని టీచర్లందరూ తమకు కావాల్సిన స్థానాలకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాల్సి వచ్చింది. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అంగీకరించలేదు. బదిలీల చట్టంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ అని పేర్కొనడంతో ఆ ప్రకారమే జరగాలని తాను చట్టాన్ని ఉల్లంఘించనని మంత్రి తేల్చిజెప్పారు.

Updated Date - Jun 10 , 2025 | 01:26 AM