Share News

భూమికి నష్టపరిహారం ఇచ్చారు.. చెట్లకు, బోర్లకు మరిచారు..!

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:12 PM

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేశారని, భూమిలో ఉన్న చెట్లకు, బోరుకు, పైప్‌లైన్లకు నష్టపరిహారం చెల్లించకుండానే రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారని వైస్‌ఎంపీపీ గంధం ఏసురత్నం ఆరోపించారు.

భూమికి నష్టపరిహారం ఇచ్చారు.. చెట్లకు, బోర్లకు మరిచారు..!
తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైస్‌ ఎంపీపీ

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణంతో భూ బాధితుల ఆవేదన

పామూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేశారని, భూమిలో ఉన్న చెట్లకు, బోరుకు, పైప్‌లైన్లకు నష్టపరిహారం చెల్లించకుండానే రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారని వైస్‌ఎంపీపీ గంధం ఏసురత్నం ఆరోపించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మరో రైతుతో కలిసి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని నర్రమారెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల వైస్‌ ఎంపీపీకి చెందిన పోకా వెంకట్రావు భూమిలో రైల్వేలైన్‌ భూసేకరణలో 1.47 ఎకరాల భూమి, డేగా మాల్యాద్రికి చెందిన 80 సెంట్ల భూమిని భూసేకరణ చేశారని అందుకుగాను నష్టపరిహారం అందజేసి ఉన్నారని తెలిపారు. ఆ భూమిలో ఉండే టేకు, మామిడి, నిమ్మ, ఉసిరి, వేప, నేరుడు చెట్లతోపాటు మూడుబోర్లకు పైప్‌లైన్‌కు అవార్డు ప్రకటించకుండానే పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత వీఆర్వోలను అడిగితే అవార్డు రాలేదని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి అప్పీల్‌ చేసుకోవాలంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తగిన నష్టపరిహారం సొమ్ములు మంజూరు చేసేలా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 08 , 2025 | 11:12 PM