సమ్మె బాట పట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:48 PM
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మెను ప్రారంభించారు
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ వద్ద సమ్మె
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మెను ప్రారంభించారు. జిల్లాలోని 538 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్లు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ బీఎస్సీ నర్శింగ్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉన్నత విద్య చదివినప్పటికీ వారు చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేదన్నారు. ఒక నిర్ధిష్టమైన పనిలేకుండా రకరకాలుగా పనులు చేయిస్తూ పనిభారం పెంచడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగులకు వెంటనే పనిభారం తగ్గించాలని డిమాండ్‌చేశారు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యూలర్ చేయాలని డిమాండ్‌చేశారు. ఎన్‌ఎంహెచ్ ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్ ఇచ్చివేతనాలు చెల్లించాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఓపీ దగ్గర నుంచి రోగులకు బీపీ, షుగర్, చిన్న పిలలలకు క్యాన్సర్ పరీక్షలతో పాటు అనేక రకాల వైద్యుల సలహాలు, సౌకర్యాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారనితెలిపారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కోశాధికారి జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం రాజేష్, ఎ. నిర్మల, జీవనజ్యోతి, ప్రసన్న, సయ్యద్ గౌస్ తదితరులు ఉన్నారు.