డీఎస్సీ ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:22 AM
మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగింది. గురువారం అభ్యర్థులకు ప్రాథమిక ఎంపిక ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కొందరిలో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసి ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే జరిగిందని నిరూపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
జోనల్, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు
ఏడు రకాల అంశాలకు అవకాశం
ఒంగోలు విద్య, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగింది. గురువారం అభ్యర్థులకు ప్రాథమిక ఎంపిక ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కొందరిలో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసి ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే జరిగిందని నిరూపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డీఎస్సీ అభ్యర్థుల మెరిట్, తిరస్కరణకు గురైన జాబితాలు, ఎంపిక జాబితాలపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించనుంది. అందుకోసం జోనల్, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. జోనల్‌స్థాయి కమిటీకి ఆర్‌జేడీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జోన్ పరిధిలోని ఇద్దరు డీఈవోలు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఈ కమిటీలు స్వీకరించి 15 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి కమిటీకి విద్యాశాఖ అదనపు డైరెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీఎస్సీ కన్వీనర్, ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ల ఎస్టాబ్లిష్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీల పరిష్కారంపై సంతృప్తి చెందని వారు నేరుగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అభ్యంతరాలను 30 రోజుల్లోపు పరిశీలించి పరిష్కరిస్తారు. ఏడు రకాల అంశాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఇవ్వవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.