రాత్రి వేళ వచ్చి.. అతిథిగృహంలో సేదతీరి..!
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:38 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సెక్షన్ 51 విచారణకు తొలిరోజు బ్రేక్ పడింది. విచారణాధికారైన రాష్ట్ర సహకారశాఖ అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ రాత్రి ఏడు గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకొని బ్యాంకుకు వెళ్లేందుకు కబురు పంపారు. పనివేళలు ముగిసి చాలాసేపు అయినందున అధికారులు, సిబ్బంది వెళ్లిపోయారన్న సమాధానం అటువైపు నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో విచారణాధికారి రాత్రికి అక్కడే సేదతీరారు.
డీసీసీబీలో విచారణకు తొలిరోజు బ్రేక్
ఆలస్యంగా వచ్చిన విచారణాధికారి
బ్యాంకు సమయం అయిపోయిందని వెళ్లిపోయిన అధికారులు
ఒంగోలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సెక్షన్ 51 విచారణకు తొలిరోజు బ్రేక్ పడింది. విచారణాధికారైన రాష్ట్ర సహకారశాఖ అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ రాత్రి ఏడు గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకొని బ్యాంకుకు వెళ్లేందుకు కబురు పంపారు. పనివేళలు ముగిసి చాలాసేపు అయినందున అధికారులు, సిబ్బంది వెళ్లిపోయారన్న సమాధానం అటువైపు నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో విచారణాధికారి రాత్రికి అక్కడే సేదతీరారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే సాగుతుందని, బ్యాంకులో వైసీపీ కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలు వెలుగులోకి రాకుండా కొందరు బ్యాంకు ఉద్యోగులే అడ్డుపడుతుండటంతో ఇలా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు సహకార శాఖ ఉన్నతాధికారుల తీరు ఊతమిస్తోంది. తొలి నుంచి ఈ విషయంలో జిల్లా యంత్రాంగానికి సహకారశాఖ ఉన్నతాధికారుల నుంచి సహకారం కొరవడింది. తాజాగా విచారణాధికారి వ్యవహారశైలి కూడా అలాగే కనిపిస్తోంది. సాధారణంగా ఏ సంస్థలోనైనా విచారణ చేయాల్సి వస్తే విచారణాధికారిగా నియమితులైన వారు ముందుగా సంబంధిత కార్యాలయానికి సమాచారం ఇస్తారు. కార్యాలయం పనిచేసే సమయంలో వచ్చి అవసరమైతే రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగిస్తారు. అయితే డీసీసీబీలో విచారణ వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంది. విచారణాధికారైన గౌరీశంకర్ మంగళ, బుధవారాల్లో విచారణకు వస్తున్నట్లు స్థానిక సహకారశాఖ అధికారులకు తెలియజేయగా తదనుగుణంగా బ్యాంకు అధికారులకు వారు తెలియజేశారు. ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరులోని సహకారశాఖ కమిషనర్ కార్యాలయంలో అదనపు రిజిస్ట్రార్ అయిన విచారణాధికారి మంగళవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరినా గంటన్నరలో ఇక్కడకు రావచ్చు. మధ్యాహ్నం బయల్దేరినా మూడు గంటల కల్లా వచ్చి విచారణ ప్రారంభించవచ్చు. అయితే అందుకు భిన్నంగా రాత్రి ఏడు గంటలకు సదరు అధికారి అతిఽథిగృహానికి చేరారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారన్న సమాచారం ఉన్న స్థానిక సహకారశాఖ అధికారులు ఆ మేరకు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తీరా రాత్రి ఏడు గంటలకు విచారణాధికారి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకోగా అక్కడ ఆయన్ను సహకారశాఖ అధికారులు రీసీవ్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకుకు చెందిన బాధ్యత గల అధికారులు కూడా అక్కడ ఉంటారు. అలాంటిది బ్యాంకు అధికారులు ఎవ్వరూ లేరని సమాచారం. ఆ పరిస్థితుల్లో విచారణాధికారి బ్యాంకుకు వస్తున్నారని అందరూ అందుబాటులో ఉండాలని సహకారశాఖ అధికారులు సమాచారం పంపగా పనివేళలు ముగిసి చాలా సమయం అయినందున అందరూ వెళ్లిపోయారన్న సమాధానం అటు నుంచి రావడంతో సదరు అధికారులు అవాక్కయ్యారు. అదే విషయాన్ని వారు విచారణాధికారి గౌరీశంకర్‌కు తెలియజేశారు. సాధారణంగా ఇలాంటి సందర్భంలో విచారణాధికారి బ్యాంకు అధికారులపై తీవ్రంగా స్పందించాలి. అందుకు భిన్నంగా ప్రస్తుత విచారణాధికారి గౌరీశంకర్ ఆ విషయాన్ని వదిలేసి కొద్దిసేపు స్థానిక సహకార శాఖ అధికారులతో మాట్లాడి బుదవారం ఉదయం సమీపంలోని సొసైటీలో ఎరువుల పరిశీలనకు వెళ్దామని చెప్పి పంపించినట్లు తెలిసింది. రాత్రికి ఆయన అతిథిగృహంలో బస చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సహకార వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. తొలి నుంచి ఉన్నతాధికారులు బ్యాంకులో సెక్షన్ 51 విచారణపై విముఖత చూపుతున్నారని, అలాగే బ్యాంకులో అక్రమాలకు, అవకతవకలకు బాధ్యులైన కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులతో టచ్‌లో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణాధికారి తీరుతో తొలిరోజు విచారణ సాగకపోవడం అందుకు ఊతమిస్తోంది.