విద్యుత్ శాఖలో వసూల్ రాజా
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:33 AM
కొండపి మండలంలోని ఓ విద్యుత్ అధికారి వసూల్ రాజా అవతారం ఎత్తాడు. పైసలిస్తేనే పనిచేస్తున్నాడు. వ్యవసాయ, పారిశ్రామిక కనెక్షన్‌లకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు. కొందరు డబ్బులు చెల్లించినా మరికొంత కావాలని పట్టుబడుతున్నాడు. దీంతో రైతులు, పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న అధికారి
వ్యవసాయ కనెక్షన్‌కు రూ.70వేల నుంచి రూ.లక్ష డిమాండ్
పారిశ్రామిక అవసరాలకు పెద్దమొత్తంలో కలెక్షన్
నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కనెక్షన్‌లు
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
అయినా మారని అధికారి తీరు
కొండపి మండలంలోని ఓ విద్యుత్ అధికారి వసూల్ రాజా అవతారం ఎత్తాడు. పైసలిస్తేనే పనిచేస్తున్నాడు. వ్యవసాయ, పారిశ్రామిక కనెక్షన్‌లకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు. కొందరు డబ్బులు చెల్లించినా మరికొంత కావాలని పట్టుబడుతున్నాడు. దీంతో రైతులు, పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. పలువురు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ అధికారి తీరు మార్చుకోకపోవడం వివాదాస్పదమైంది. ఆర్నెల్లుగా ఈయన సాగిస్తున్న అవినీతి బాగోతంపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు కదిలారు. మంగళవారం కొండపికి వచ్చి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్‌లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరడం చర్చనీయాంశమైంది.
కొండపి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కొండపి మండలంలో సాగునీటి వనరులు అంతంతమాత్రమే. వర్షాధారంగానే రైతులు ఎక్కువగా పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవల బోర్ల కింద విస్తీర్ణం పెరిగింది. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకొని విద్యుత్ శాఖ మండల అధికారి ఒకరు అందిన కాడికి దండుకుంటున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి దోచుకుంటున్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం మండలంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 135 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతకుముందు దరఖాస్తు చేసుకొన్న వారికి విద్యుత్ కనెక్షన్‌లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇదే అదనుగా ఆర్నెళ్ల క్రితం మండలానికి వచ్చిన విద్యుత్‌శాఖ అధికారి వసూళ్లకు తెరతీశాడు. మండలంలోని శివారు గ్రామమైన కోయవారిపాలెంకు చెందిన రైతును రూ.70వేల వరకూ డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ వ్యవసాయ కనెక్షన్‌కు వైర్లు, స్తంభాలు వచ్చాయని తెలుసుకున్న కట్టావారిపాలెంనకు చెందిన ముగ్గురు రైతులు సదరు అధికారిని కలవగా ఆయన పైసలిస్తేనే పనిచేస్తానని చెప్పాడు. దీంతో వారు రూ.40వేలు చెల్లించారు. మరోవైపు నాయకులు, ఉన్నతాధికారులతో సిఫార్సు చేయించుకున్నారు. అయినప్పటికీ ఆ అధికారి నుంచి ఆశించిన స్పందన కరువైంది. ఇలా అనేకమంది రైతులు ఆయన ధనదాహాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.
నిబంధనలు తూచ్
అక్రమ సంపాదనలో మునిగితేలుతున్న సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారికి వెంటనే పనిచేస్తూ మిగిలిన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజాప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుండగా కొండపి మండల విద్యుత్ అధికారి వారిని కూడా డబ్బుల కోసం వేధిస్తున్నాడు. పరిశ్రమలకు సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.3లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. వాణిజ్య అవసరాలకు వాడుకునే త్రీఫేస్ మీటర్‌కు రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొండపిలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ యజమాని నుంచి రూ.20వేలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా 8 కనెక్షన్‌లు ఇచ్చారు. నిబంధనల ప్రకారం నాలుగు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆరోపణలకు బలాన్నిస్తోంది. ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే ఇలాంటి వ్యవహారాలు ఇంకా అనేకం ఉన్నాయి.
నాయకులు, ఉన్నతాధికారులకు వాటాలంటూ గుంజుడు
‘విద్యుత్ కనెక్షన్లు ఊరికే రావు నాయనా.. నేను నాయకులు, ఉన్నతాధికారులకు వాటాలు ఇవ్వాలి. మీరు నేను అడిగినంత చెల్లిస్తేనే పని అవుతుంది నాయనా!’ అంటూ ఆ అవినీతి అధికారి తన వద్దకు పనికోసం వెళ్లే వారితో కరాఖండిగా చెబుతున్నారు. దీన్ని కొందరు తమ సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డు కూడా చేశారు. సదరు అధికారి వ్యవహార శైలి రోజురోజుకూ శ్రుతిమించుతుండటంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. వారి ఆదేశాలతో కందుకూరు ఈఈ ఎ.వీరయ్య, సింగరాయకొండ డీఈఈ పి.యుగంధర్ రంగంలోకి దిగారు. మంగళవారం కొండపి వచ్చి విద్యుత్‌శాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది.
డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి
కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లను ప్రాధాన్యత క్రమంలో ఇస్తామని ఈఈ ఎ.వీరయ్య, డీఈఈ యుగంధర్ తెలిపారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. స్థానిక విద్యుత్‌శాఖ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది వ్యవసాయ కనెక్షన్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అనేకమంది రైతులు ఇటీవల ఎస్‌ఈకి ఫోన్‌లు చేసి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మండలంలో 135 వ్యవసాయ కనెక్షన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వారు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్‌లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఎస్‌ఈ సెల్‌ఫోన్ నంబర్ 94408 11748, కందుకూరు ఈఈ నంబర్ 94931 74270, సింగరాయకొండ డీఈఈ 94408 17498 నంబర్లలో ఫిర్యాదు చేయాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న సదరు అవినీతి అధికారి కూడా తన సెల్‌ఫోన్ నంబర్‌ను ప్రకటించి ఫిర్యాదు చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది.