Share News

కలెక్షన్‌ కింగ్‌!

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:31 AM

ఆయన మండల స్థాయిలో కీలక అధికారి. అభివృద్ధి పనులు చేసి మండలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనది. చుట్టపుచూపుగా కార్యాలయానికి వచ్చే అయ్యగారు మామూళ్ల వసూళ్లలో మాత్రం మేటి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కలెక్షన్‌ కింగ్‌!

మండలస్థాయి అధికారి బరితెగింపు

డబ్బుల కోసం కిందిస్థాయి ఉద్యోగులపై జులుం

15వ ఆర్థిక సంఘం నిధులు స్వాహా

ఉద్యానశాఖ అధికారి నుంచి నగదు డిమాండ్‌

అధికార పార్టీ నాయకుడూ బాధితుడే

పుల్లలచెరువు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఆయన మండల స్థాయిలో కీలక అధికారి. అభివృద్ధి పనులు చేసి మండలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనది. చుట్టపుచూపుగా కార్యాలయానికి వచ్చే అయ్యగారు మామూళ్ల వసూళ్లలో మాత్రం మేటి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, అధికారపార్టీ నాయకుల నుంచి కూడా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ అధికారిగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకున్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. పాలన అనుభవం సుదీర్ఘంగా ఉండటంతో నగదు అక్రమంగా డ్రా చేసుకోవడంలో ఆరితేరారు. మండలానికి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఇలాగే స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి.

చేతిపంపుల మరమ్మతుల్లో మాయ

మండలంలోని మెజారిటీ గ్రామాల్లో చేతిపంపులు వినియోగంలో లేవు. దానినే అవకాశంగా మలుచుకొని సదరు అధికారి ఓ వ్యక్తి పేరుతో మరమ్మతులు చేసినట్లు చూపి రూ.2.48 లక్షల బిల్లులు చేసుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మోటారు బిగింపునకు రూ.1.20 లక్షల నిధులను చెల్లించారు. అయితే మోటారు బయట కొత్తది కొనుగోలు చేసినా రూ.40 వేలలోపు ఉంటుంది. ఇక ఇక్కడ కొత్త మోటారు బిగించిన దాఖలాలు కూడా లేవు. అక్కడ పాతదే ఉన్నప్పటికీ, నిధులు మాత్రం డ్రా అయ్యాయి. పుల్లలచెరువు ఎస్సీ కాలనీలో సైతం రోడ్డు పనులు చేసినట్లు చూపి నిధులు కైంకర్యం చేశారు. పనులు చేయకుండా పెద్దఎత్తున 15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకున్న అనుభవంతో సదరు అధికారి అధికారపార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా చక్కలు చూపిస్తున్నాడు.


మచ్చుకు కొన్ని ఉదాహరణలు..

15వ ఆర్థిక సంఘం నిధులను పనులు చేయకుండానే ఓ ప్రజాప్రతినిధి రూ.3 లక్షల బిల్లులు పెట్టుకున్నారు. అందులో రూ.2లక్షలు ఇచ్చిన సదరు అధికారి తన వారి పేరుతో రూ.లక్ష బిల్లు చేసుకున్నారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి పార్టీ పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు. దీంతో చేసేది లేక అధికారి డబ్బును తిరిగి ఇచ్చినట్లు తెలిసింది.

పుల్లలచెరువు మండల కేంద్రంలో పనిచేసే వ్యవసాయశాఖ సంబంధించిన కిందిస్థాయి ఉద్యోగిని కూడా డబ్బుల కోసం బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా ఆ అధికారి వ్యవహారం చూసి ఉపాఽధి పనులు చేసేందుకు జంకుతున్నారు. మండలంలోని కవలకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తకు పంట కుంటలు మంజూరు చేస్తానని చెప్పి ఫోన్‌పే ద్వారా మామూళ్లు పొందాడు. అనంతరం సదరు వ్యక్తితో ఈ అధికారి పలకడం మానేశాడు.

ఇక మండలంలోని పంచాయతీల్లో అధికశాతం వైసీపీ సర్పంచులే ఉన్నారు. సర్పంచులు పనులు చేయకుండానే వారికి బిల్లులు చేసి వారి నుంచి భారీగా దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:31 AM