ఎక్సైజ్‌లో కోల్డ్ వార్
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:41 PM
ఒంగోలులోని ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేయడానికి గురువారం వెళ్లిన ఉన్నతాధికారికి వింత అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం వివిధ కేసులలో దొరికిన మద్యాన్ని ధ్వంసం చేయడంతోపాటు స్టేషన్‌ను తనిఖీ కోసం ఉన్నతాధికారి వెళ్లారు.
స్టేషన్ తనిఖీకి వెళ్లిన ఉన్నతాధికారి
అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులు స్వాధీనానికి యత్నం
కోపంతో ఊగిపోయిన స్టేషన్ నిర్వహణ బాధ్యతలు చేస్తున్న అధికారి
ఫొన్ నేలకేసి కొట్టిన వైనం
సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకుంటున్న ఉన్నతాధికారి
ఒంగోలు క్రైం, జూలె ౖ31(ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేయడానికి గురువారం వెళ్లిన ఉన్నతాధికారికి వింత అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం వివిధ కేసులలో దొరికిన మద్యాన్ని ధ్వంసం చేయడంతోపాటు స్టేషన్‌ను తనిఖీ కోసం ఉన్నతాధికారి వెళ్లారు. రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారి కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అందుకు స్టేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి రికార్డులు ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాకుండా జనరల్ డైరీ అసంపూర్తిగా ఉండటాన్ని ఉన్నతాధికారి ప్రశ్నించారు. దీంతో స్టేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి కోపంతో ఊగిపోయి తన సెల్‌ఫోన్ విసిరి నేలకేసి కొట్టారు. ఇలా రాత్రి పొద్దుపోయేవరకు స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారి స్టేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసారు. దీంతో రెండు రోజులుగా స్టేషన్‌లో విధులలో ఉన్న సిబ్బంది నుంచి అక్కడ జరిగిన పరిణామాలపై రాత పూర్వక వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారి ఆదేశించారు. అక్కడ ఉన్న సెంట్రీ కానిస్టేబుల్‌తో పాటు సిబ్బంది రాత పూర్వకంగా జరిగిన విషయం ఇచ్చారు. ఈమేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు నివేదిక పంపించేందుకు జిల్లా ఉన్నతాధికారి సిద్ధమయ్యారు.