Share News

సీఎం పర్యటన ఖరారు

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:42 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే నెల 2న దర్శి మండలం తూర్పువీరాయపాలెం వస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగ్రామంలో జరిగే సభలో ప్రారంభించనున్నారు.

సీఎం పర్యటన ఖరారు
తూర్పువీరాయపాలెం వద్ద అధికారులకు సూచనలిస్తున్న మంత్రి స్వామి, పక్కన కలెక్టర్‌ అన్సారియా, టీడీపీ దర్శి ఇన్‌చార్జి లక్ష్మి

2న దర్శి మండలం తూర్పువీరాయపాలెంకు రాక

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి స్వామి, కలెక్టర్‌ అన్సారియా, గొట్టిపాటి లక్ష్మి

అధికారులకు పలు సూచనలు

ఒంగోలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే నెల 2న దర్శి మండలం తూర్పువీరాయపాలెం వస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగ్రామంలో జరిగే సభలో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన స్థలాన్ని బుధవారం సాయంత్రం జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఆ ప్రాంతంలో పర్యటించి ఖరారు చేశారు. 2వ తేదీ ఉదయం 11 గంటలకు వీరాయపాలెం చేరుకునే సీఎం సాయంత్రం నాలుగు గంటల వరకూ అక్కడే ఉంటారు. తొలుత అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నియోజకవర్గస్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. గతానికి భిన్నంగా ప్రస్తుతం భారీ బహిరంగ సభలకు స్వస్తి చెప్పి పరిమిత సంఖ్యలో ఆయావర్గాల ప్రజలతో ఇష్టాగోష్టి తరహాలో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవాన్ని కూడా అలానే నిర్వహించనున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంపిక చేసిన తూర్పువీరాయపాలెం గ్రామానికి చెందిన వారితోపాటు పరిమిత సంఖ్యలో పరిసర గ్రామ ప్రాంత రైతులతో సభ నిర్వహించాలని నిర్ణయించారు.

సీఎంవో అధికారుల జూమ్‌ కాన్ఫరెన్స్‌

కార్యక్రమ నిర్వహణపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రి డాక్టర్‌ స్వామి, కలెక్టర్‌ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లతో బుధవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ ప్రకారం హెలీప్యాడ్‌, రైతుల సభ, కార్యకర్తల సమావేశం అన్నీ దగ్గరదగ్గరగా ఒకే ప్రాంతంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుండగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం రాత్రి సంబంధిత జిల్లా అధికారులతో మంత్రి స్వామి, కలెక్టర్‌ అన్సారియా తూర్పువీరాయపాలెంలో సమీక్ష చేసి తగు ఆదేశాలు ఇచ్చారు.

యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటనకు కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లకు యంత్రాంగం సిద్ధమైంది. గురువారం ఉదయం నుంచి అక్కడ ఏర్పాట్లు ప్రారంభంకానున్నాయి. తొలుత తూర్పువీరాయపాలెంతోపాటు రాజంపల్లి, దర్శి శివారులోని శివరాజునగర్‌, ఇతర మరికొన్ని ప్రాంతాలను పరిశీలించినప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయ సూచనలకు అనుగుణంగా కార్యక్రమ నిర్వహణకు తూర్పువీరయపాలెం అనువుగా ఉంటుందని భావించి అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, పలువురు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 01:42 AM