2న జిల్లాకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:37 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చేనెల 2న జిల్లాకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆరోజున ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం
కార్యక్రమ స్థలంపై నేడు స్పష్టత
ఒంగోలు జూలై 29 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చేనెల 2న జిల్లాకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆరోజున ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతస్థాయి నుంచి జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియాలకు మంగళవారం రాత్రి సమాచారం అందింది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అందులో ప్రధానమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండు నెలల క్రితమే అమలుచేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పీఎం కిసాన్‌తో అనుసంధానం చేశారు. దీంతో కేంద్రం ప్రస్తుత ఏడాది తొలి విడత నిధులు విడుదల చేసే రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాను అర్హులైన రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఆగస్టు 2వతేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వారణాసిలో ఈపథకం నిధులు విడుదల చేయనున్నారు. దీంతో అదేరోజు రాష్ట్రంలోనూ అన్నదాత సుఖీభవ అమలుకు శ్రీకారం చుడుతున్నారు.
మూడు విడతలుగా రూ.20వేలు జమ
అన్నదాత సుఖీభవ కింద మొత్తం రూ.20వేలు మూడు విడతల్లో నగదు రూపంలో రైతు ఖాతాలో ప్రభుత్వం జమచేయనుంది. అందులో రూ.6వేలు పీఎం కిసాన్ పథకం కింద, రూ.14వేలను రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఇవ్వనుంది. వచ్చేనెల 2న తొలివిడత రూ.2వేలు కేంద్రం, రూ.5వేలు రాష్ట్ర ప్రభుత్వం వెరసి రూ 7వేలను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
2.70లక్షల మందికి లబ్ధి
గ్రామాల వారీ అర్హులైన వారి జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అభ్యంతరాలను కూడా స్వీకరించి వారిలో అర్హులైన వారిని కూడా గుర్తిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో సుమారు 2.70 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. మన జిల్లా నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారన్న విషయమై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాక తొలివిడత తూర్పుప్రాంతంలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి చంద్రబాబు వచ్చారు. మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవిడత కూడా పశ్చిమప్రాంతానికే ఆయన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.