డీఎస్సీ వైద్య సర్టిఫికెట్లపై నిశిత పరిశీలన
ABN , Publish Date - Sep 13 , 2025 | 10:39 PM
డీఎస్సీ టీచర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఏ పొరపాటుకు తావువివ్వకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
నాల్గో వంతు అభ్యర్థులు తిరస్కృతి
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పణ
ఒంగోలు విద్య, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీ టీచర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఏ పొరపాటుకు తావువివ్వకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అందులో భాగంగా దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గతంలో బదిలీలకు కొందరు ఉపాధ్యాయులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి తాము కోరుకున్న స్థానాలు పొందడంతోపాటు ప్రతినెల అదనంగా రూ. 2వేలు అలవెన్స్ కూడా పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అభ్యర్థులకు దివ్యాంగ సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనికోసం ప్రత్యేకంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో మెడికల్ బోర్డులు ఏర్పాటుచేశారు.
బోగస్ తేలితే డాక్టర్‌పై చర్యలు
బోర్డు ముందు హాజరయ్యే అభ్యర్థులకు సర్టిఫికెట్ల జారీలో అనుమానాలు ఉంటే మరో బోర్డుకు పంపిస్తామని, అక్కడ బోగస్ అని తేలితే సంబంధిత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ముందే హెచ్చరించింది. దీంతో జిల్లాలో మెడికల్ బోర్డు ముందు హాజరైన అభ్యర్థుల్లో నాల్గో వంతు మంది సర్టిఫికెట్లను అధికారులు తిరస్కరించారు. జిల్లాలో డీఎస్సీకి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, గిరిజన, సంక్షేమ పాఠశాలల్లో 672 పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు 20 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు అక్రమ మార్గాల్లో తప్పుడు వైద్య ధ్రువీకరణ పత్రాలతో టీచర్ పోస్టు సాధనకు ప్రయత్నాలు చేసి దొరికిపోయారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ డీఎస్సీలో దివ్యాంగులకు మూడు శాతం పోస్టులు రిజర్వు చేశారు. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లలో వీరికి స్థానాలు కేటాయించారు. దృష్టిలోపం ఉన్నవారు. శారీరక అంగవైకల్యం, మల్టిబుల్ డిజార్డర్ ఉన్నవారికి కనీసం 40శాతం, వినికిడిలోపం ఉన్నవారికి కనీసం 60 డెసిబుల్స్ మించి ఉంటేనే రిజర్వేషన్ లభిస్తోంది. వినికిడి లోపం ఉన్నవారికి గుంటూరు జిల్లా మెడికల్ బోర్డుకు, మిగిలిన వారిని ఒంగోలు రిమ్స్ మెడికల్ బోర్డుకు రెఫర్ చేశారు.
ఏడుగురివి
అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లు సమగ్రంగా ఉన్న అభ్యర్థులను వైకల్యం ధ్రువీకరణకు గుంటూరు, ఒంగోలు మెడికల్ బోర్డులకు పంపారు. మొత్తం 29 మంది అభ్యర్థులను వైద్యపత్రాల ధ్రువీకరణకు పంపగా వీరిలో నాల్గవవంతు మించి అంటే ఏడుగురివి తప్పుడు సర్టిఫికెట్లని తేలింది. మిగిలిన 22 మందిని ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నారు. వినికిడి లోపం ఉన్న 11 మందిని గుంటూరు పంపగా వీరిలో ఐదుగురి సర్టిఫికెట్లు బోగ్‌సగా తేలాయి. ఒంగోలు రిమ్స్‌కు వెళ్లిన తొమ్మిది మంది దృష్టిలోపం అభ్యర్థుల్లో ఇద్దరివి బోగ్‌సగా గుర్తించారు. శారీరక వైకల్యం ఉన్నవారు ఎనిమిది మంది, మల్టిబుల్ డిజార్డర్ గల ఒక అభ్యర్థి సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. టీచర్ పోస్టులకు ఎంపిక జోన్‌లో నిలిచి తప్పుడు వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారిని అనర్హులుగా ప్రకటించి మెరిట్‌లో ఆ తర్వాత అభ్యర్థులకు ఎంపికలో అవకాశం కల్పించారు.
19న సీఎం చేతుల మీదుగా...
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామకపు పత్రాలు అందజేయనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారు. గతంలో 2016లో సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పుడు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులందరినీ విజయవాడకు పిలిపించి నియామకపత్రాలు అందజేశారు. అప్పట్లో అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో విజయవాడ మీటింగ్‌కు హాజరుకాగా ప్రభుత్వ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను వెలగపూడికి తరలించే బాధ్యతను జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగించారు.
జిల్లా నుంచి 30 బస్సులు
వెలగపూడి సచివాలయంలో కొత్త టీచర్ల నియామక పత్రాలు జారీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో టీచర్ పోస్టులకు ఎంపికయ్యే 672 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల్లో ఒకరు కలిపి 1,344 మందిని 30 బస్సుల్లో తరలించనున్నారు. వీరందరూ 18వ తేదీ సాయంత్రానికి ఒంగోలుకు చేరుకోవాలి. ఒంగోలులో వీరికి బస ఏర్పాటు చేసి రాత్రి భోజనం, 19వ తేదీ ఉదయం అల్పాహారం ఇచ్చి వారందరికి సీఎం సభకు తరలిస్తారు. మళ్ళీ వారిని ఒంగోలు తీసుకు వచ్చే బాధ్యతలను డీఈవోలకు అప్పగించారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో కిరణ్‌కుమార్ తెలిపారు.