పరిశుభ్రతే లక్ష్యం
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:11 AM
పరిశుభ్రతే లక్ష్యంగా శనివారం జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలు చేయించారు.
జిల్లావ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
ర్యాలీలు, సభలు, పరిశుభ్రత కార్యక్రమాలు
పొన్నలూరులో భారీ ప్రదర్శన
పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు
ఇతరచోట్ల ప్రజాప్రతినిధులు హాజరు
విద్యార్థుల కోసం ‘ముస్తాబు’ ప్రారంభం
ఆరోగ్యానికి మంచి అలవాట్లపై అవగాహన
ఒంగోలు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : పరిశుభ్రతే లక్ష్యంగా శనివారం జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలు చేయించారు. రాష్ట్ర మంత్రి నుంచి జిల్లాస్థాయి నేత వరకు, కలెక్టర్ నుంచి సచివాలయ ఉద్యోగి వరకు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికార యంత్రాంగం, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతినెలా మూడో శనివారం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కో నెలలో ఒక్కో అంశం ప్రధానంగా ప్రజలకు అవగాహన, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి పరిశుభ్రత వాతావరణం కల్పించే అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అందులోభాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలపై వివరించారు. పారిశుధ్య కార్మికులను సత్కరించారు. అదేసమయంలో పాఠశాలలు ప్రత్యేకించి హాస్టళ్లలోని విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని కూడా జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభించారు. హైస్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టగా హాస్టళ్లలో ప్రత్యేకంగా ఇందుకు సంబంధించి రోజువారీ చేపట్టాల్సిన చర్యలపై నిర్దేశించి అమలు ప్రారంభిస్తున్నారు.
పొన్నలూరులో స్వచ్ఛాంధ్ర ర్యాలీ
మండల కేంద్రమైన పొన్నలూరులో శనివారం ఉదయం వందలాది మందితో స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబుతోపాటు పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్తాబు కార్యక్రమాన్ని లాంఛనంగా డాక్టర్ స్వామి ప్రారంభించారు. చీమకుర్తిలో జరిగిన స్వచ్ఛాంధ్ర ర్యాలీలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పాల్గొనగా, కనిగిరిలోని అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. గిద్దలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తర్లుపాడు మండలం జరిగిన కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, దోర్నాలలో టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు పాల్గొన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు సచివాలయ స్థాయిలో కార్యక్రమాలు జరిగాయు. కాగా జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల అవరణలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో సంస్థ జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.