నగరం.. నవ్యపథం!
ABN , Publish Date - May 22 , 2025 | 01:47 AM
ఒంగోలులో రోడ్లకు మహర్దశ వచ్చింది. నగరాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సెంటర్ డివైడర్ల నిర్మాణం, పచ్చని మొక్కలు నాటడం, లైటింగ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. అందుకనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ఒంగోలులో రోడ్లకు మహర్దశ..!
విస్తరణపై కార్పొరేషన్ అధికారుల దృష్టి
ఇప్పటికే పలుచోట్ల మొదలైన పనులు
విశాలంగా మారిన కర్నూలు రోడ్డు
త్వరలో బీవీఎస్ హాల్ రోడ్డు, ట్రంక్‌రోడ్డు కూడా?
ట్రాఫిక్ సమస్యకు చెక్‌పెట్టేందుకు చర్యలు
భవన యజమానులకు టీడీఆర్ బాండ్లు
ఒంగోలులో రోడ్లకు మహర్దశ వచ్చింది. నగరాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సెంటర్ డివైడర్ల నిర్మాణం, పచ్చని మొక్కలు నాటడం, లైటింగ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. అందుకనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం పెద్ద సమస్యగా మారింది. మునిసిపాలిటీగా ఏర్పడిన నాటి రోడ్లే ఇప్పటికీ ఉండగా, కార్పొరేషన్ హోదాకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ ప్రకారం వాటి విస్తరణ లేకుండా పోయింది. ఈనేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని రోడ్లను విస్తరించారు. మిగతా కీలకమైన వాటి దశ మార్చడానికి రంగం సిద్ధం చేశారు. విస్తరణలో నష్టపోయే భవన యజమానులకు పరిహారంగా టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు తెలిసింది.
ఒంగోలు, కార్పొరేషన్, మే 21 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో వాహన ప్రయాణం అంటే ఇప్పటివరకు నరకమే. ఆ సమస్యకు చెక్‌పెట్టే దిశగా కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. కీలకమైన రోడ్ల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్నింటిని పూర్తిచేయగా, మిగతా వాటిలో ముఖ్య మైన రోడ్ల విషయమై కసరత్తు చేస్తున్నారు. మొత్తం 3లక్షలకుపైగా జనాభా కలిగిన నగరంలో 80శాతం మందికిపైగా వాహన వినియోగదారులు ఉన్నారు. 1876లో మునిసిపాలిటీగా ఏర్పడిన ఒంగోలుకు సుమారు 140 ఏళ్లు. అనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్పొరేషన్ హోదాను దక్కించుకుంది. జిల్లాకేంద్రం కావడంతో అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, వివిధ విద్యాసంస్థలు, పెద్ద ఆసుపత్రులు, వివిధ వ్యాపార సముదాయాలకు నిలయంగా మారింది. దీంతో కేవలం నగర జనాభానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజూ వచ్చిపోయే వారు వేలసంఖ్యలోనే ఉన్నారు. కాగా అందుకనుగుణంగా రోడ్లు లేక ఉన్నవాటికి ఇరువైపులా ఆక్రమణలు చోటుచేసుకోవడంతో వాహన ప్రయాణం కన్నా, కాలినడకే నయం అన్నచందంగా పరిస్థితి మారింది. ప్రస్తుతం 25 చదరపు కిలోమీటర్లు కలిగిన నగరంలో 317 కి.మీ రహదారులు ఉన్నాయి. అందులో సీసీ రోడ్లు 197.70 కి.మీ, బీటీరోడ్లు 7.80 కి.మీ, డబ్లూబీఎం రోడ్లు 63.53 కి.మీ, కచ్చారోడ్లు 46 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ వాహన ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధే ధ్యేయంగా, రహదారుల విస్తరణపై కార్పొరేషన్ అధికారులు దృష్టిసారించారు.
ట్రంక్ రోడ్డు కూడా విస్తరణ..!
మిరియాలపాలెం సెంటర్ నుంచి పాత మార్కెట్ వరకూ ట్రంక్‌రోడ్డును విస్తరణ చేసే దిశగా కూడా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలో కర్నూలు రోడ్డు విస్తరణ పనులు జరగ్గా, అదేసమయంలో ట్రంక్ రోడ్డునూ కూడా విస్తరించాలని నిర్ణయించారు. ఆ మార్గం 100 అడుగులు ఉండేలా మార్కింగ్ కూడా చేశారు. అయితే అప్పట్లో వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయకపోవడం, ఇతరత్రా కారణాలతో వాయిదా పడింది. అయితే మరోసారి పదిహేనేళ్ల తర్వాత తిరిగి ట్రంక్‌రోడ్డు విస్తరణఅంశం తెరపైకి వచ్చినట్లు సమాచారం. దశల వారీగా చేపడుతున్న పనుల్లో భాగంగా దీన్ని కూడా 100 అడుగులు విస్తరించనున్నట్లు తెలిసింది.
త్వరలో బీవీఎస్ సెంటర్..
త్వరలోనే కొత్తపట్నం బస్టాండ్ నుంచి బీవీఎస్ సినిమా థియేటర్ మీదుగా పాత మార్కెట్ సెం టర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టను న్నారు. ఇరువైపులా అటు 25 అడుగులు, ఇటు 25 అడుగులు వెడల్పు చేయనున్నారు. మొత్తం 80 అడుగుల రోడ్డు చేయనున్నారు. అందులో భాగంగా ఇటీవల ఆ ప్రాంత వ్యాపారులు, భవన యజమానులతో కమిషనర్ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. నగర అభివృద్ధిలో చేపట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు.
ఇప్పటికే పలు రోడ్లు విస్తరణ
ఈక్రమంలో ఇప్పటికే కర్నూలు రోడ్డు విస్తరణ చేపట్టగా, మరోవైపు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లో ఆక్రమణలు తొలగించి వెడల్పు చేయడంతో ఆ ప్రాంతం సరికొత్త శోభ సంతరించుకుంది. అలాగే సీవీఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ నుంచి కొణిజేడు బస్టాండ్ సెంటర్ వరకు రెండు వైపులా ఆక్రమణలు తొలగించి రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముఖ్యమైన రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. సుజాతనగర్‌లో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి పాత తాలూకా పోలీస్ స్టేషన్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి.
నష్టపరిహారంగా టీడీఆర్ బాండ్‌లు
విస్తరణలో కోల్పోయే భవన నిర్మాణం ఏసంవత్సరంలో నిర్మించారు. నిర్మాణానికి ఆనాడు అయిన ఖర్చు, ప్రస్తుత మార్కెట్ విలువ, కాలాన్ని బట్టి నష్ట అంచనాలను వేసి భవన యజమానులకు ప్రభుత్వం తరపున టీడీఆర్ బాండ్లు అందజేయనున్నారు. అయితే రోడ్డు విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగా ఆయా ప్రాంతాల భవన యజమానులతో మాట్లాడి, వారి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అభివృద్ధికి ఆటంకం లేకుండా ముందుకెళ్లే దిశగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఏదిఏమైనప్పటికీ ట్రాఫిక్ సమస్య నియంత్రణకు, నగర హోదాకు అనుగుణంగా రహదారుల విస్తరణ పనులు జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.