రాష్ట్ర దేవదాయ శాఖ సలహాదారుగా చుండూరి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:44 PM
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి
ఒంగోలు కల్చరల్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి) : ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. నగరంలో జన్మించి, విద్యాభ్యాసం చేసిన సీతారామంజనేయ ప్రసాద్ చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక భావాలు కలిగి యువకునిగా ఉండగానే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన దేవదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్(హెచ్‌డీపీటీ)కి చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయటమే కాకుండా వివిధ వివిధ ప్రదేశాలలో కోటి దీపోత్సవం, దశ సహస్ర సువాసినీ పూజ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ధర్మ శంఖారావం మాసపత్రికను సైతం ఆయన ప్రారంభించారు. ఒంగోలు నగరంలో గాయత్రి పరివార్ పేరుతో సంస్థను స్థాపించి అనేక మంది యువకులను ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేశారు.
ఆయన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఉచిత అన్నదానం, ఉచితంగా హోమియో వైద్య సేవలు, అనేక దేవాలయాల నిర్మాణానికి సహకారం, గో సంరక్షణ, దేశవాళీ గోవుల పెంపకం, సంరక్షణపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి ఆయన నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 గాయత్రీ పీఠాలను ఆయన నెలకొల్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో లక్ష గాయత్రీ యజ్ఞం, ఒంగోలు పీవీఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో లక్ష గాయత్రీహోమం, సింగరకొండలో లక్ష దీప యజ్ఞం వంటివి నిర్వహించారు. తనను రాష్ట్ర ప్రభుత్వం మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించటంపై సీతారామాంజనేయప్రసాద్ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకే్‌షలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, హిందూ ధర్మ ప్రచారానికి కృషిచేస్తానని ఈ సందర్భంగా ఆయన ’ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.