Share News

మెప్మాలో ఉలికిపాటు

ABN , Publish Date - Nov 22 , 2025 | 02:42 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై విజిలెన్స్‌ విచారణకు రంగం సిద్ధమవుతోంది. దీంతో రూ.కోట్లు స్వాహా చేసిన ఆర్పీలు, వారి వద్ద ముడుపులు తీసుకొని సంపూర్ణ సహకారం అందించిన అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలైంది.

మెప్మాలో ఉలికిపాటు

అవినీతి బహిర్గతం కావడంతో బాధ్యుల్లో వణుకు

బోగస్‌ గ్రూపులు సృష్టించిన ఆర్పీల్లో భయం

సహకరించిన కార్యాలయ సిబ్బంది మల్ల్లగుల్లాలు

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై విజిలెన్స్‌ విచారణకు రంగం సిద్ధమవుతోంది. దీంతో రూ.కోట్లు స్వాహా చేసిన ఆర్పీలు, వారి వద్ద ముడుపులు తీసుకొని సంపూర్ణ సహకారం అందించిన అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలైంది. గత కొన్నేళ్లుగా బోగస్‌ గ్రూపులతో పొదుపు మహిళల పేరుతో రూ.కోట్ల దోపిడీ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. తాజాగా కార్యాలయంలోని సీవోలు, కొందరు సిబ్బంది, చివరికి ముఖ్యఅధికారి అవినీతి వ్యవహారాలు బహిర్గతమవుతున్నాయి. ఆర్పీల చేతిలో మోసపోయిన పొదుపు మహిళలు మెప్మా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారి మొర అలకించేవారు కరువయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలను ఆసరా చేసుకొని ఆ సంస్థ అధికారి ఆర్పీలను బెదిరించి భారీగానే వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకరిపై ఒకరు నిందలు.. వాస్తవాలు వెలుగులోకి

మెప్మాలో చోటుచేసుకున్న అవినీతిపై రెండు రోజులుగా పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. సునీల్‌ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఆఫీసు నిధులను డ్రా చేసి మోసం చేశాడని పోలీసులకు పీడీ శ్రీహరి ఫిర్యాదు చేయడంతో సునీల్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. అతను మెప్మాలో అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తున్నాడు. అన్నీ పీడీ కనుసన్నల్లోనే జరిగాయని వెల్లడిస్తున్నట్లు తెలిసింది. దీంతో అవినీతి వ్యవహారాలకు పాల్పడిన వారు వాటిని కప్పి పుచ్చుకునేందుకు, వాటి నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.4.45 లక్షలు సునీల్‌ కాజేశాడని పీడీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా.. అతను ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు సమాచారం. అయితే సునీల్‌పై పీడీ మరికొన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కార్యాలయంలో కంప్యూటర్లు పోయాయని మరోసారి కేసు పెట్టాలని పోలీసులపై పీడీ ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఆధారాలు చూపాలని, కంప్యూటర్‌లకు తనకు సంబంధం ఏమిటని సునీల్‌ ప్రశ్నించడంతో పీడీ వెనక్కు తగ్గినట్లు సమాచారం. మరోవైపు మెప్మాను గాడిన పెట్టడంపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలోనూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరైన రుణాలు, బోగస్‌ రుణాలపై ఆయన విజిలెన్స్‌ విచారణ కోరారు. దీంతో మెప్మా కార్యాలయంలో కలవరం మొదలైంది.

మెప్మా గాడిన పడేనా?

గత వైసీపీ హయాం నుంచి మెప్మాలో బోగస్‌ గ్రూపుల బాగోతం మొదలైంది. నేటికీ అది కొనసాగుతోంది. దీంతో పొదుపు సభ్యులకు తీరని నష్టం వాటిల్లుతోంది. వారి పేరుతో రుణాలు పొందిన వారు దర్జాగా ఉంటున్నారు. ఏమీ తెలియని వారికి రూ.లక్షలు బకాయి ఉన్నాయంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండటంతో బాధితులు బోరుమంటున్నారు. విజిలెన్స్‌ విచారణతోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని బాధిత పొదుపు సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఎలాంటి అవినీతీ చోటుచేసుకోలేదు

- పి.శ్రీహరి, మెప్మా పీడీ

మెప్మాలో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. తాను బాధ్యతలు తీసుకోకముందు బోగస్‌ గ్రూపులను సృష్టించి రుణాలు తీసుకున్న కొందరు ఆర్పీలను అప్పట్లోనే తొలగించారు. మరలా ఇటీవల కాలంలో కొందరు బోగస్‌ గ్రూపులు సృష్టించారని నా దృష్టికి వచ్చింది. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేనే స్వయంగా ఎస్పీకి లేఖ రాశా. కొందరు ఆర్పీల వద్ద నుంచి నేను డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. పొదుపు మహిళలకు రుణాలు మంజూరు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం.

ఎంతటివారైనా వదిలేది లేదు : ఎమ్మెల్యే దామచర్ల

మెప్మాలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలలో బాధ్యులు ఎంతటివారైనా వదిలేది లేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పట్టణ పొదుపు మహిళలు ఆర్ధిక పురోభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం అనేక రకాలుగా రుణాలు అందించి ఆదుకుంటున్నదన్నారు. వాటిని కొందరు స్వప్రయోజనాలకు వాడుకుంటూ అర్హులైన లబ్దిదారులను ఇబ్బందులు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై తాను స్వయంగా మంత్రి నారాయణను కలిసి విజిలెన్స్‌ విచారణ కోరినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేసిన రుణాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు.

Updated Date - Nov 22 , 2025 | 02:42 AM