Share News

ప్రత్యామ్నాయం వైపు మిర్చి రైతు చూపు!

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:34 AM

వాణిజ్య పం టల్లో రారాజు మిర్చి. అన్నీ అనుకూలిస్తే రైతులకు సిరుల పంటే. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ధరలు బాగుంటే రైతు లకు రూ.లక్షల్లో ఆదాయం తీసుకువచ్చేది ఈ పంటే. పశ్చిమ ప్రకాశంలో గతంలో మిర్చి సాగు చేసిన రైతులు బాగానే లాభాలు ఆర్జించారు. అయితే రెండేళ్లుగా మిరప నష్టాల ఘాటు చూపిస్తోంది.

ప్రత్యామ్నాయం వైపు  మిర్చి రైతు చూపు!
తర్లుపాడు మండలం కారుమానిపల్లె వద్ద మిర్చి వేసే పొలంలో సాగు చేసిన బొప్పాయి

మార్కాపురం డివిజన్‌లో తగ్గిన విస్తీర్ణం

పెరిగిన బొప్పాయి, మొక్కజొన్న సాగు

మార్కాపురం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పం టల్లో రారాజు మిర్చి. అన్నీ అనుకూలిస్తే రైతులకు సిరుల పంటే. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ధరలు బాగుంటే రైతు లకు రూ.లక్షల్లో ఆదాయం తీసుకువచ్చేది ఈ పంటే. పశ్చిమ ప్రకాశంలో గతంలో మిర్చి సాగు చేసిన రైతులు బాగానే లాభాలు ఆర్జించారు. అయితే రెండేళ్లుగా మిరప నష్టాల ఘాటు చూపిస్తోంది. ఒకవైపు తెగుళ్లు, మరోవైపు దిగుబడులు తగ్గడం, ఇంకోవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, యాజమాన్య ఖర్చులు పెరగడం, మార్కెటింగ్‌ సౌకర్యాలు మెరుగ్గా లేకపోవడం తదితరాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీంతో ప్రస్తుతం మిర్చి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. రెండేళ్లుగా క్రమేపీ సాగు విస్తీర్ణం తగ్గుతోంది. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మరలుతున్నారు. ఏదో కొద్దిపాటి విస్తీర్ణంలో మాత్రమే మార్కాపురం డివిజన్‌లో సాగవుతోంది.

ఏటికేడు తగ్గుతున్న సాగు విస్తీర్ణం

జిల్లాలో వాణిజ్య పంటల్లో పొగాకు, మిర్చి ప్రధానమె ౖనవి. పొగాకు ఎక్కువగా రబీ సీజన్‌లో సాగవుతుంది. మిర్చి ఖరీఫ్‌ చివర నుంచి ప్రారంభమై రబీ మధ్య వర కునాటుతారు. వాతావరణం అనుకూలిస్తే ఖరీ్‌ఫలో కూడా అధిక మొత్తంలో సాగవుతుంది. జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 75వేల ఎకరాల వరకు ఉంటుంది. అందులో 50 వేల ఎకరాల వరకు మార్కాపురం డివిజన్‌లోని 13 మండలాల్లోనే సాగు చేస్తారు. రెండేళ్ల క్రితం జిల్లాలో సాధారణ విస్తీర్ణానికి మించి మరో 20వేలు ఎకరాలు సాగైంది. దీంతో 95వేల ఎకరాలకు చేరింది. గతేడాది సుమారు 40వేల ఎకరాల మేర తగ్గి 55వేల ఎకరాలకే పరిమితమైంది. అందు లో మార్కాపురం డివిజన్‌లోనే 41,871 ఎకరాల్లో సాగు చేశారు. ఎన్నడూలేని విధంగా అధిక వర్షాలు, విపరీతమైన తెగుళ్లు, కనీస గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడంతో రూ.లక్షల్లో రైతులు నష్టపోయారు. దీంతో ఇప్పడు మిర్చి అంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ వరకు డివిజన్‌లో 8వేల ఎకరాల్లో మాత్రమే మిర్చి నాట్లు వేశారు. రబీలో మరో 10 నుంచి 15వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరంతో పోల్చితే మార్కాపురం డివిజన్‌లో సాగు విస్తీర్ణం 50 శాతానికి పైగా తగ్గినట్లే.

మొక్కజొన్న, బొప్పాయి వైపు మొగ్గు

మిరప సాగు చేసి నష్టాలు చవిచూసిన రైతులు ఈ సంవత్సరం ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. ఈ సంవత్సరం మొక్కజొన్న, బొప్పాయి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా బొప్పాయి సాగు పెరిగింది. ఎక్కువగా మొక్కలు లభించేది ఎర్రగొండపాలెంలోనే. అయితే డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్ర, అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బొప్పాయి మొక్కలను దళారులు తెచ్చి రైతులకు అమ్మారు. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన ప్రతినిధులు సీడ్‌ కోసం రైతులకు పెట్టుబడి ఇచ్చి మరీ సాగు చేయించారు. ఖరీ్‌ఫలో గతంలో ఎన్నడూలేని విధంగా విత్తన మొక్కజొన్న ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. రబీలో డిసెంబర్‌లో కూడా మళ్లీ రైతులు మొక్కజొన్న వేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక బాగా నష్టపోయిన కొందరు మిర్చి రైతులు మెట్ట పంటలైన కంది, మినుము, సజ్జ, నువ్వులు, జూట్‌, ఆముదం సాగు చేశారు. యాజమాన్య ఖర్చులు తక్కువగా ఉండడంతో ఆ వైపు రైతులు మరలారు.

Updated Date - Oct 12 , 2025 | 01:34 AM