Share News

మోసం రాజా

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:36 AM

జిల్లాలో సహకారశాఖ అధికారుల తీరు మారడం లేదు. మా శాఖ.. మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారి పర్యవేక్షణలోని సహకార సంస్థలపై ఉన్నతస్థాయి విచారణలు జరుగుతున్నా కొందరు ఆ శాఖ జిల్లా అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

మోసం రాజా

డీసీఏవో కార్యాలయం నుంచి పొన్నలూరు సొసైటీ సీఈవోపై బోగస్‌ పిటిషన్లు

అటెండర్‌ ద్వారా రిజిస్టర్‌ పోస్టు

గుర్తించి పోలీసులకు సీఈవో ఫిర్యాదు

మంత్రి స్వామి దృష్టికి వ్యవహారం

డీసీఏవోపై ఆయన ఆగ్రహం

విచారణ చేయాలని కలెక్టర్‌కు ఆదేశం

అధికారుల సూచన మేరకే పోస్టు చేశానంటున్న అటెండర్‌

తనను బెదిరించి సస్పెండ్‌ చేసే ప్రయత్నంచేస్తున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

జిల్లాలో సహకారశాఖ అధికారుల తీరు మారడం లేదు. మా శాఖ.. మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారి పర్యవేక్షణలోని సహకార సంస్థలపై ఉన్నతస్థాయి విచారణలు జరుగుతున్నా కొందరు ఆ శాఖ జిల్లా అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా జిల్లా సహకార ఆడిట్‌ అధికారి (డీసీఏవో) కార్యాలయం కేంద్రంగా వెలుగుచూసిన బోగస్‌ పిటిషన్ల వ్యవహారం, అందులో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే కీలకంగా ఉండటం ఆ శాఖ పనితీరుకు దర్పణం పడుతోంది. తన దృష్టికి విషయం రావడంతో డీసీఏవో రాజశేఖర్‌పై మంత్రి స్వామి తీవ్రస్థాయిలో ఆగ్రహించడమే కాక మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అటెండర్‌ నవాజ్‌ కలెక్టర్‌ను కలిసి డీసీఏవోపై ఫిర్యాదు చేశారు. తనను సస్పెండ్‌ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రస్తుతం ఆశాఖలో విస్తృత చర్చకు దారితీసింది.

ఒంగోలు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని సహకారశాఖలో అడ్డగోలు వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు తమది స్వయం ప్రతిపత్తి గల శాఖ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పినట్లు నడుచుకోని ఉద్యోగులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహకార రంగంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పీఏసీఎస్‌లలో వార్షిక ఆడిట్‌ అధికారం డీసీఏవోది. అలా పొన్నలూరు సొసైటీని ఆడిట్‌ చేయించిన డీసీఏవో పోలిశెట్టి రాజశేఖర్‌ అందులో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలిందని, విచారణకు రావాలని గత ఫిబ్రవరిలో అక్కడి సీఈవో మనోజ్‌కుమార్‌కు నోటీసు ఇచ్చారు. అయితే తనపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేయడంతోపాటు భారీగా అక్రమాలు జరిగాయంటూ సహకార ఆడిట్‌ అధికారులు నివేదిక రూపొందించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అందులో డీసీఏవోతోపాటు కొందరు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి చర్యలను తాత్కాలికంగా ఆపేయాలని అధికార పార్టీ నేతలు సదరు అధికారికి చెప్పినట్లు సమాచారం.

కార్యాలయం నుంచే పిటిషన్లు

తాము అనుకున్న విధంగా పొన్నలూరు సొసైటీపై విచారణ కొనసాగించడానికి వీలుపడకపోవడంతో డీసీఏవో కార్యాలయ ఉద్యోగులు కొందరు బోగస్‌ పేర్లతో ఉన్నతాధికారులకు పిటిషన్లు పెట్టారు. వాటిని తమ కార్యాలయ అటెండర్‌ ద్వారా రైల్వే మెయిల్‌ సర్వీసు నుంచి రిజిస్టర్‌ చేయించారు. ఆ బోగస్‌ పిటిషన్ల ఆధారంగా విచారణకు హాజరుకావాలని డీసీఏవో నుంచి నోటీసు అందుకున్న సీఈవో మనోజ్‌కుమార్‌ ఇందులో ఏదో కుట్ర ఉందని అనుమానించి కూపీ లాగారు. అది ఆ శాఖ జిల్లా అధికారి ప్రమేయంతో కార్యాలయ సిబ్బంది ద్వారా జరిగిందని గుర్తించారు. అంతేకాక మార్చి 4వతేదీ సాయంత్రం ఆర్‌ఎంఎస్‌లో ఆ పిటిషన్లను డీసీఏవో కార్యాలయ అటెండర్‌ పోస్టు చేస్తున్న సీసీ ఫుటేజీలను గుర్తించిన సీఈవో మనోజ్‌ దానిపై పోలీసులకు ఫిర్యాదుచేయడంతోపాటు మంత్రి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే డీసీవో, డీసీఏవో కార్యాలయాలు, ఆ శాఖల జిల్లా అధికారులపై తీవ్రఆరోపణలు నిత్యం వస్తుండటంతో డీసీఏవో రాజశేఖర్‌ను మంత్రి పిలిపించుకున్నారు. ఏమి జరిగిందన్న విషయం విచారించి ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఆ సమయంలో డీసీఏవోతోపాటు కార్యాలయ అటెండర్‌ నవాజ్‌ కూడా ఉండగా బోగస్‌ పిటిషన్‌గా నిర్ధారించుకున్న మంత్రి ఆ వ్యవహారంపై విచారణ చేయాలని కలెక్టర్‌ అన్సారియాను ఆదేశించారు. అనంతరం సీఈవో మనోజ్‌కుమార్‌ కూడా కలెక్టర్‌ అన్సారియాకు ఫిర్యాదు చేశారు.

బెడిసిన దిద్దుబాటు చర్య

మొత్తం వ్యవహారం బహిర్గతంకావడంతో డీసీఏవో కార్యాలయం నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యాలయ ఉద్యోగులు, మరికొందరు కలిసి పొన్నలూరు సీఈవోపై బోగస్‌ పిటిషన్లను తన ద్వారా రిజిస్టర్‌ పోస్టు చేయించి ఇప్పుడు మొత్తం నేరం తనపైనే మోపి సస్పెండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని అటెండర్‌ నవాజ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మరోసారి సహకారశాఖలో జరుగుతున్న ఘోరం వెలుగులోకి వచ్చింది. అటెండర్‌ నవాజ్‌ చేసిన ఫిర్యాదు మేరకు.. డీసీఏవో కార్యాలయ ఉద్యోగి ఉదయ్‌నాగభూషణం మార్చి 4వతేదీ సాయంత్రం ఐదు కవర్లు, డబ్బులు ఇచ్చి ఆర్‌ఎంఎస్‌లో రిజిస్టర్‌ పోస్టు చేయాలని చెప్పగా తాను వెళ్లి అలా చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో రెండు, మూడు సార్లు ఆయన ఫోన్‌ చేసి పనిపూర్తి అయిందా లేదా అని కూడా అడిగారని తెలిపారు. పని అయ్యాక స్లిప్‌లను నాగభూషణం వాట్సాప్‌కు పంపి తాను వెళ్లిపోయానని చెప్పారు. ఆ కవర్లలో ఉన్నవి ఏమిటన్నది తనకు తెలియదన్నారు. ఈ విషయంపై పొన్నలూరు సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశాక తన ద్వారా బోగస్‌ పిటిషన్లు పోస్టుచేయించిన విషయం గుర్తించానన్నారు. విషయం వెలుగులోకి వచ్చాక తన ఫోన్‌ను నాగభూషణం తీసుకొన్నారని ఆరోపించారు. వాట్సాప్‌లో ఉన్నవి డెలీట్‌ చేయడమే కాక సదరు కవర్లు డీసీఏవో ఇవ్వమంటే నేను ఇచ్చాను తప్ప నా ప్రమేయం లేదని, విచారణలో తన పేరు చెప్పవద్దని కోరినట్లు అటెండర్‌ పేర్కొన్నారు.


బెదిరించి స్టేట్‌మెంట్‌

మరోవైపు తన పైఅధికారి ఈ విషయంపై తానే విచారణాధికారినని... కలెక్టరేట్‌ వద్ద డేవిడ్‌ అనే వ్యక్తి కవర్లు ఇస్తే రిజిస్టర్‌ పోస్టు చేశానని తన చేత బెదిరించి స్టేట్‌మెంట్‌ తీసుకొని తనను సస్పెండ్‌ చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. డేవిడ్‌ అనే వ్యక్తి తనకు తెలియదు, నాగభూషణం అనే కార్యాలయ ఇన్‌స్పెక్టర్‌ చెప్తేనే అందులో ఏమి ఉందనేది పట్టించుకోకుండా పోస్టు చేశానని పేర్కొన్నారు. ఉదయ్‌ నాగభూషణం, డీసీఏవో రాజశేఖర్‌లు అత్యంత సన్నిహితులని పేర్కొన్న నవాజ్‌ ఈ వ్యవహారంపై తన పైఅధికారి అయిన డీసీఏవో తప్పుడు స్టేట్‌మెంట్‌ను బెదిరించి తీసుకొని సస్పెండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అందిన ఫిర్యాదును పరిశీలించాలని జేసీ గోపాలకృష్ణను పురమాయించినట్లు సమాచారం. కాగా మొత్తం వ్యవహారాన్ని సహకారశాఖ కమిషనర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో బాధితుడు నవాజ్‌ ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Apr 10 , 2025 | 02:36 AM