అస్తవ్యస్తంగా సాగునీటి పంపిణీ
ABN , Publish Date - Aug 10 , 2025 | 10:21 PM
సాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. సాగర్ జలాలు ఎందుకు విడుదల చేశారో, వారానికే మళ్లీ ఎందుకు నిలుపుదల చేశారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సాగునీటి పంపిణీ తీరు అధ్వానంగా మారటంతో అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.
ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
దర్శి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): సాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. సాగర్ జలాలు ఎందుకు విడుదల చేశారో, వారానికే మళ్లీ ఎందుకు నిలుపుదల చేశారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సాగునీటి పంపిణీ తీరు అధ్వానంగా మారటంతో అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రణాళిక లేకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం.
సాగర్ కుడికాలువకు పదిరోజుల క్రితం నీటిని విడుదల చేశారు. ఆక్రమంలో జిల్లాలోని కాల్వలన్నింటికీ పుష్కలంగా నీరు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఈనెల 2న అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించేందుకు దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామానికి వచ్చారు. ఆరోజు సాగర్ కాలువలకు నిండుగా నీరు వదిలారు. సాగర్ ప్రధాన కాలువ 85/3 మైలు(ప్రకాశం బార్డర్‌కు) 2300 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు ఆనీరు నేరుగా దర్శి బ్రాంచ్ కాలువ నుంచి ఒంగోలు బ్రాంచ్ కాలువకు చేరింది. మధ్యలో కొన్నిచోట్ల పోయిననీరు మినహా అధికశాతం ఓబీసీకి చేరింది. ఆ సమయంలో ఒంగోలు బ్రాంచ్ కాలువ(ఓబీసీ)కు సుమారు 1300 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండటంతో కాలువ కట్టలు అంచులను తాకుతూ పొంగి పోర్లిపోయే పరిస్థితి నెలకొంది. దర్శి సమీపంలో ఒంగోలు బ్రాంచ్ కాలువ కట్ట ఎక్కడ తెగిపోతుందోనని ఆందోళన చెందారు. ఆవిధంగా పుష్కలంగా నీరు విడుదల చేయటంతో రైతులు ఆనందంతో వరినార్లు పోశారు. బోర్ల వసతి ఉన్న రైతులు అంతకుముందే నార్లు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉన్న రైతులు సాగర్ జలాలు రావటంతో ముమ్మరంగా వరినాట్లు ఆరంభించారు. సీఎం చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహించిన ప్రాంతంలో కూడా రైతులు వరినాట్లు వేస్తూ కనిపించారు. కొన్ని పొలాలకు వరినాట్లు వేసేందుకు దమ్ము చేసి సిద్ధం చేశారు. ఒక దశలో సీఎం చంద్రబాబు వరినాట్లు వేసే పొలాన్ని సందర్శించి రైతులతో మాట్లాడతారని భావించారు. అధికారులు అందుకు అనుగుణంగా రైతులతో మాట్లాడేందుకు సీఎం వచ్చే అవకాశం ఉందని సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే చంద్రబాబు పొలాల్లోకి వెళ్లలేదు. అధికారులు ఇక కాలువకు నీరు విడుదల చేశారనే ఉద్దేశంతో దర్శి ప్రాంతంలో ముమ్మరంగా వరినాట్లు చేపట్టారు. రైతులు ఈఏడాది ముందుగా సాగు నీరు వచ్చాయనే ఆనందంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో అకస్మికంగా సాగర్ కాలువలకు నీటి సరఫరాను నిలిపివేశారు.
సాగర్ ప్రధాన కాలువలతో పాటు బ్రాంచ్ కాలువలకు నీటి పరిమాణం తగ్గిపోవటంతో అన్నదాతలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎండలు వేసవిని మరిపిస్తున్నాయి. దీంతో వేసిన లేత వరినాట్లు గత మూడు రోజులుగా నీరులేక వాడుముఖం పట్టాయి. అధికారులు సాగర్ కాలువలకు నీరు ఎందుకు విడుదల చేశారో, ఎందుకు నిలుపుదల చేశారో అర్థంకాక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పంపిణీ అధ్వానంగా మారిందని వాపోతున్నారు. వందలాది ఎకరాల్లో వరినాట్లు వేసి ఎండిపోయే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు ఇప్పటికే విడుదలచేసిన సాగునీరు ఎందుకు నిలిపివేశారో కారణం తెలుపలేదు. కొంతమంది అధికారులు మాత్రం అడిగిన రైతులకు రెండవ జోన్‌కు సాగుకు అధికారికంగా నీరు విడుదల చేయలేదని చెబుతున్నారు. కేవలం వరదనీరు ఉధృతంగా రావటంతో ఆ సమయంలో ఇతర అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సాగర్ కాలువలకు నీరు విడుదల చేశారని చెబుతున్నారు. ఆవిషయం అధికారులు ముందుగా ప్రకటించి ఉంటే రైతులు తొందరపడి వరినాట్లు వేసేవారుకాదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలకు నిండుగా నీరు చేరటంతో పంటల సాగుకు నీరు విడుదల చేశారనే ఉద్దేశంతో రైతులు వరినాట్లు పోయటం, తదితర పంటల సాగును ముమ్మరంగా చేపట్టారు. ప్రస్తుతం కాలువలకు నీటి సరఫరా నిలచిపోవటంతో అన్నదాతల పరిస్థితి అయోమయంలో పడింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు రైతులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి సాగునీటి పంపిణీపై తగు నిర్ణయం తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.