Share News

టీడీపీ అధ్యక్షుడి మార్పు ఖాయం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:43 PM

ఒంగోలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించాలని ఆ పార్టీలోని ముఖ్యనాయకులు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా సామాజిక వర్గాల వారీ ముగ్గురి పేర్లను సూచించారు. ఆమేరకు ఆదివారం ఒంగోలులో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్రం నుంచి వచ్చిన త్రిసభ్య కమిటీకి ఒంగోలు, మార్కాపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డితోపాటు ఎర్రగొండపాలె ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పేర్లను సిఫార్సు చేశారు. అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై కూడా మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో త్రిసభ్య కమిటీ చర్చించింది. మొత్తం 18 కమిటీల్లో కొన్నింటిని ఆయా నియోజకవర్గాలకు కేటాయించారు.

టీడీపీ అధ్యక్షుడి మార్పు ఖాయం

దామచర్ల, కందుల, గూడూరి పేర్లు సిఫార్సు

సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయమని తీర్మానం

ఒంగోలుకు యువత, తెలుగు మహిళ పదవులు

దర్శికి తెలుగు రైతు పదవి, గిద్దలూరుకు లీగల్‌ విభాగం

త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం

ఒంగోలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించాలని ఆ పార్టీలోని ముఖ్యనాయకులు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా సామాజిక వర్గాల వారీ ముగ్గురి పేర్లను సూచించారు. ఆమేరకు ఆదివారం ఒంగోలులో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్రం నుంచి వచ్చిన త్రిసభ్య కమిటీకి ఒంగోలు, మార్కాపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డితోపాటు ఎర్రగొండపాలె ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పేర్లను సిఫార్సు చేశారు. అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై కూడా మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో త్రిసభ్య కమిటీ చర్చించింది. మొత్తం 18 కమిటీల్లో కొన్నింటిని ఆయా నియోజకవర్గాలకు కేటాయించారు.

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు వచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులు లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మంత్రి స్వామితోపాటు ఎమ్మెల్యేలు దామచర్ల, డాక్టర్‌ ఉగ్ర, ముత్తుముల, కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జులు లక్ష్మి, ఎరిక్షన్‌బాబుతోపాటు ఆహ్వానించిన కిందిస్థాయి నాయకులు పాల్గొన్నారు. లోక్‌సభ కమిటీకి అధ్యక్షుడి ఎంపికతోపాటు 18 అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకంపై సమావేశానికి హాజరైన వారి నుంచి అభిప్రాయం సేకరించారు. చివర్లో త్రిసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో ప్రత్యేకంగా భేటీ అయి వారి అబిప్రాయాలనూ తెలుసుకున్నారు. తొలుత పార్టీ లోక్‌సభ అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్న వారు పేర్లు ఇవ్వాలని కోరారు. అందుకు అనుగుణంగా కొందరు తమ పేర్లు పరిశీలించాలని కమిటీకి సూచించారు. అలా సూచించిన వారిలో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకునే క్రమంలో ఒంగోలు లోక్‌సభ అధ్యక్ష పదవికి ఎవరికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తారో చెప్పలేమని అందుకని ఇద్దరు, ముగ్గురు పేర్లు సూచించాలని కమిటీ సభ్యులు కోరారు.

అధ్యక్ష పదవిని ఆశించడం లేదన్న ఉగ్ర, ముత్తుముల, గొట్టిపాటి

కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, దర్శి టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మిలు తాము అధ్యక్ష పదవిని ఆశించడం లేదని స్ఫష్టం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేసినట్లు తెలిసింది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు తమకు అవకాశం ఇస్తే అధ్యక్ష బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. చివరకు ముఖ్య నాయకులంతా కలిసి మూడు సామాజిక వర్గాలకు సంబంధించి ఒంగోలు, మార్కాపురం ఎమ్మెల్యేలు జనార్ధన్‌, కందుల నారాణరెడ్డితోపాటు ఎర్రగొండపాలె ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పేర్లను రాష్ట్ర పార్టీకి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత అధ్యక్షుడు బాలాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నందున కొత్త వారికే అవకాశం ఇవ్వాలని సభ్యులంతా సూచించడం విశేషం. మహిళా కోటాతోపాటు ఆయా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని సీఎం చంద్రబాబు ఎవరికి అవకాశం ఇచ్చినా తమకు సమ్మతమేనంటూ నాయకులు త్రిసభ్య కమిటీకి స్పష్టంగా చెప్పారు.


అనుబంధ సంఘాల అధ్యక్షులపై చర్చ

అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై కూడా మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో త్రిసభ్య కమిటీ చర్చించింది. మొత్తం 18 అనుబంధ సంఘాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు కొన్ని పదవులు కేటాయిస్తూ అధ్యక్ష పదవి పేర్లు అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు సూచించేలా నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగు యువత, తెలుగు మహిళ అధ్యక్ష పదవులను కేటాయించారు. తెలుగు రైతు అధ్యక్ష పదవిని దర్శి నియోజకవర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. లీగల్‌ విభాగం అధ్యక్ష పదవి గిద్దలూరుకు కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాలకు ఆయా విభాగాల అధ్యక్ష పదవులను కేటాయించి పేర్లు సూచించాలని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులను త్రిసభ్య కమిటీ కోరినట్లు తెలిసింది.

Updated Date - Aug 24 , 2025 | 11:43 PM