చెరువులకు గండ్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:26 PM
బేస్తవారపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది.ఏళ్లతరబడి ఏర్పడిన గండ్లను పూడ్చలేదు. పంట కాలువలు, తూ ములు అధ్వానంగా ఉన్నాయి.
ఏళ్లుగా మరమ్మతులు కరువు
బీళ్లుగా వందల ఎకరాల భూములు
ఆయకట్టుదారుల ఆందోళన
కోనపల్లె - పూసలపాడు పరిస్థితి ఆధ్వానం
బేస్తవారపేట, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : బేస్తవారపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది.ఏళ్లతరబడి ఏర్పడిన గండ్లను పూడ్చలేదు. పంట కాలువలు, తూ ములు అధ్వానంగా ఉన్నాయి. జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు మంజూరైన నిధులను సక్రమంగా చెరువులకు ఉపయోగంచకపోవడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.గ్రామాల్లోని కొన్ని చెరువులకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గత నెలలో కురిసన వర్షాలకు కోనపల్లె చెరువులో నీరు పూర్తి స్థాయిలో చేరి అలుగు పారింది. దీంతో రైతులు ఆశతో ఎదురు చూశారు. ఇకనైనా తమ పొలాలు పంటలు పండుతాయని అంతలోనే వారి ఆవలు అడియాశలయ్యాయి. చెరువు నిండింది. మూడు రోజులకే చెరువులోని నీరు ఖాళీ అయ్యాయి. ఆ చెరువు కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారింది. చెరువు నిర్మించప్పటి నుంచి దాదాపు ఇప్పటికి రూ.4కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరమ్మతులు చేయడం చెరువుకు మళ్లీ గండ్లు పడడం పరిపాటైంది. చెరువులో సొరంగాలు ఏర్పడి దిగువన ఉన్న వాగులోకి నీరు వెళ్తుంది. చెరువుకు కోట్ల రూపాయాలు ఖర్చు చేసిన నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. దీంతో దాని కింద ఉన్న వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. పలువురు నిపుణులు పరిశీలించి అనేక రకాల పనులు ప్రయోగాత్మకంగా చేసినా ఫలితం దక్కలేదు. 500 ఎకరాల ఆయకట్టు నిరుపయోగంగా మారింది. శింగరపల్లె గ్రామానికి తూర్పువైపున నూతనంగా చెరువులు ఏర్పాటు చేస్తే వందల ఎకరాల్లో పంటలు సస్యశ్యామలంగా పండి, రైతుల పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విషయమై అధికారులు సర్వేలకు మాత్రమే పరిమితమయ్యారు. రూ.11కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేదు. నిధులు మంజూరు కాలేదు. దీంతో వయ్యి ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. పూసలపాడు గ్రామంలోని కోట్లు ఖర్చు చేసి రెండు దశాబ్దాల కిందట చెరువును నిర్మించారు. నేటకీ అది ఉపయోగంలోకి రాలేదు. చెరువు కట్ట బలహీనంగా ఉండడంతో వరద వచ్చిన ప్రతిసారీ గండ్లు పడి నీరు వృథాగా పోతుంది. జేసీ అగ్రహారం చెరువుకు పూర్తిస్థాయిలో చెరువు కట్ట ఎత్తు పెంచాల్సి ఉండగా పెంచలేదు. అలాగే దప్పిలివారి కుంటకు సప్లై చానల్ కతువ నుంచి నీరు వచ్చే కాలువను అభివృద్ధి చేస్తే చెరువు కింది ఆయకట్టు సాగులోకి వస్తుందని రైతులు కోరుతున్నారు. మోక్షగుండం కొత్తచెరువు, ఖాజీపురం హోసూరమ్మ చెరువుల పంట కాలువుకు, తూములకు మరమ్మతులు చేయాల్సి ఉంది. జెన్నివారిపల్లె చెరువు మరమ్మతులు నోచుకోక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లాపురం చెరువుకు మరమ్మతులు చేసినా నీరు లేక సూమారు 1500 ఎకరాలు సాగులోకి రాలేదు. జగ్గంబొట్ల కృష్ణాపురం ఉప్పువాగు నుంచి ఆయకట్టు కాలువను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. పిటికాయగుళ్ల చెరువుకు రూ.2కోట్లతో పనులు చేసినా ఫలితం సక్రమంగా లేదు. చెరువులో నేటికీ చిల్లకంప నిండి ఉంది.