Share News

‘అన్నదాత’ల సంబరాలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 02:56 AM

పంటల సాగుకు ఆర్థిక తోడ్పాటు కోసం అన్నదాత సుఖీభవ నగదు జమ చేయడంతో రైతులు, తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లావ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

‘అన్నదాత’ల సంబరాలు
కనిగిరిలో నిర్వహించిన ర్యాలీలో ఎడ్లబండిని తోలుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో ర్యాలీలు

ప్రత్యేక ఆకర్షణగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు

భారీగా పాల్గొంటున్న రైతులు, టీడీపీ శ్రేణులు

ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో పూర్తి

పంటల సాగుకు ఆర్థిక తోడ్పాటు కోసం అన్నదాత సుఖీభవ నగదు జమ చేయడంతో రైతులు, తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లావ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేశారు. మంగళవారం కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో చేపట్టిన ర్యాలీలు కోలాహలంగా సాగాయి. పెద్దఎత్తున రైతులు ట్రాక్టర్‌లతో తరలివచ్చి పాల్గొన్నారు. బుధవారం సంతనూతలపాడుకు సంబంధించిన కార్యక్రమం పల్లామల్లిలో ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల కూడా ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.

ఒంగోలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా రైతుల కోసం కూటమి పార్టీల తరఫున టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటిం చారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలను మూడు విడతలుగా పీఎం కిసాన్‌ పథకం కింద ఇస్తుండగా.. గత వైసీపీ ప్రభుత్వం దానికి రూ.7,500 కలిపి రూ.13,500 రైతు భరోసా పేరుతో ఇచ్చింది. కాగా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి వారిచ్చే రూ.6వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.14వేలు కలిపి ఏకంగా రూ.20వేల నగదును అందజేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయిం చి అమల్లోకి తెచ్చింది. తొలివిడత రాష్ట్రం లో సుమారు 47 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి కేంద్రం వాటా రూ.2వేలు, రాష్ట్రం వాటా రూ.5వేలు కలిపి రూ.7వే ల నగదు అందజేశారు. జిల్లాలోని దర్శి నియోజకవర్గం తూర్పువీరాయపాలెం గ్రామం నుంచే ఈ పథకానికి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ కింద సుమారు 2.68 లక్షల మంది రైతు కుటుంబాలకు తొలివిడత రూ.186కోట్లు అందాయి. ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 42,971 మందికి రూ.29.07 కోట్లు అందాయి. కొండపి, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు రూ.25 కోట్ల నుంచి రూ.29 కోట్ల వరకు, ఇతర నియోజకవర్గాలకు తగుస్థాయిలో ఆర్థిక సహాయం అందింది. సాగువేళ అంత పెద్దమొత్తంలో అందిన నగదు రైతులకు ఉపకరించనుంది. ఈనేపథ్యంలో అన్నదాతసుఖీభవ పేరుతో తమకు ఆర్థిక సహకారం అందించిన సీఎం సుఖంగా ఉండాలని కోరుకుంటూ జిల్లాలో రైతులు, టీడీపీ శ్రేణులు కృతజ్ఞత ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

కనిగిరి, గిద్దలూరులో కోలాహలంగా ర్యాలీలు

రెండు రోజుల క్రితం మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం కామేపల్లి నుంచి చిర్రికూరపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి డాక్టర్‌ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వందలాదిగా రైతులు, టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లతో పాల్గొన్నారు. మంగళవారం కనిగిరిలో అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరులో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీలు జరిగాయి. పెద్దసంఖ్యలో రైతులు, టీడీపీ శ్రేణులు ట్రాక్టర్లతో తరలివచ్చారు. కోలాహలంగా కార్యక్రమం జరిగింది. అలాగే ఇతర నియోజకవర్గాల్లోనూ ర్యాలీల నిర్వహణకు స్థానిక టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

నేడు పల్లామల్లిలో నిర్వహణ

సంతనూతలపాడు నియోజకవర్గ ర్యాలీ బుధవారం సాయంత్రం చీమకుర్తి మండలం పల్లామల్లిలో నిర్వహించనున్నారు. చీమకుర్తితోపాటు మద్దిపాడు, ఎన్‌జీపాడు మండలాలకు కూడలిగా ఆ గ్రామం ఉండటంతో అక్కడ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ పాల్గొననున్నారు. అలాగే మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల ర్యాలీలను ఈనెల 14న నిర్వహించేందుకు అక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2025 | 02:56 AM