సీబీజీ ప్లాంట్ పనులు పునఃప్రారంభం
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:30 AM
మండలంలోని గంగదొనకొండ వద్ద రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పనులు పునఃప్రారంభమయ్యాయి. కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిశీలించారు.

పరిశీలించిన కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి
కురిచేడు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గంగదొనకొండ వద్ద రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పనులు పునఃప్రారంభమయ్యాయి. కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిశీలించారు. గంగదొనకొండ గ్రామ సర్వే నంబర్‌లు 88, 90లో 799.40 ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు రెవెన్యూ అధికారులు కేటాయించారు. దీంతో పదుల సంఖ్యలో యంత్రాలతో గత శుక్రవారం నుంచే పెద్దఎత్తున పనులు ప్రారంభించింది. శనివారం అటవీ శాఖాధికారులు వచ్చి ఆభూమి తమదంటూ పనులు నిలిపివేయించారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఎఫ్‌ఎల్‌ఆర్ దాఖలాలో ఆ భూమి గయాలు అని ఉందని అటవీ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది. వారు మాట్లాడటంతో అటవీశాఖ అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో రిలయన్స్ సంస్థ తిరిగి మంగళవారం నుంచి పనులను ప్రారంభించింది. బుధవారం కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ సిబ్బందితో కలసి వెళ్లి భూమి అభివృద్ధి పనులను చూశారు. రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా పనులు జాగ్రత్తగా జరిగేలా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు.