Share News

ఈ చిన్నారులు కనిపించలేదా?

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:19 AM

ఆ కుటుంబంలో ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు. ఉండడానికి ఇల్లు లేదు. తిండి లేదు. దిక్కుతోచని స్థితిలో ఇంటింటికీ తిరుగుతూ ఎవరైనా అన్నం పెడితే తిని జీవిస్తున్నారు. అధికారులకు ఈ చిన్నారులు కనిపించలేదు. పీ-4 సర్వేలో వీరిని గుర్తించకపోవడం గమనార్హం.

ఈ చిన్నారులు కనిపించలేదా?
భావన, కీర్తన, యశ్వంత్‌

పీ-4 సర్వేలో అధికారుల నిర్లక్ష్యం

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ముగ్గురు పిల్లలు

తమ్ముడు, చెల్లి కోసం కూలికి వెళ్తున్న అక్క

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

బేస్తవారపేట, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : ఆ కుటుంబంలో ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు. ఉండడానికి ఇల్లు లేదు. తిండి లేదు. దిక్కుతోచని స్థితిలో ఇంటింటికీ తిరుగుతూ ఎవరైనా అన్నం పెడితే తిని జీవిస్తున్నారు. అధికారులకు ఈ చిన్నారులు కనిపించలేదు. పీ-4 సర్వేలో వీరిని గుర్తించకపోవడం గమనార్హం. మండలంలోని జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన అరవీటి శ్రీనివాసులు, ఉమ అనే దంపతులు మూడేళ్ల క్రితం నెల రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో భావన (13 ఏళ్లు) పెద్ద అమ్మాయి. తల్లిదండ్రులు చనిపోయాక భావన చెల్లి కీర్తన, తమ్ముడు యశ్వంత్‌కు పెద్ద దిక్క యింది. వారిని చదివించాలని భావించి ఒక పక్క తానూ చదువుతూనే సెలవు రోజుల్లో కూలి పనులకు వెళ్తోంది. వచ్చిన డబ్బులతో చాలీచాలని జీవనం సాగిస్తున్నారు. కంభం మండలం నల్లగాల్వ గ్రామ పాఠశాలలో భావన, యశ్వంత్‌ 8వ తరగతి చదువుతున్నారు. కీర్తన 7వ తరగతి అభ్యసిస్తోంది. ముగ్గురూ నిత్యం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి వీరే భోజనం వండుకొని తింటు న్నారు. నా అనేవారు లేక, వసతులు లేక, ఆర్థిక ఇబ్బం దులతో చిన్నారులు సతమతమవుతున్నారు. దీనస్థితిలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే స్థానిక అధికారులు పీ-4 సర్వేలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నది ఆ ముగ్గురు చిన్నారులను చూస్తే అర్థమవుతోంది. మండలంలో రెండో విడత పీ-4 సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాల్లో వారు ముగ్గురు ఉన్నారని ఎంపీడీవో ఏవీ రంగనాయకులు చెప్పారు.

Updated Date - Aug 11 , 2025 | 01:19 AM