గంజాయి ముఠా పట్టివేత
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:19 PM
కొన్నాళ్లుగా మార్కాపురం పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను మార్కాపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ముగ్గురు అరెస్ట్
నిందితుల వద్ద 2 కేజీల స్వాధీనం
మార్కాపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కొన్నాళ్లుగా మార్కాపురం పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను మార్కాపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. స్థానిక ఎస్‌డీపీవో కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని జగదీశ్వరి థియేటర్ ప్రాంతానికి చెందిన సుంకర నాగరాజు బీటెక్ మధ్యలో ఆపేశాడు. చదువుకునేటప్పుడే గంజాయికి అలవాటుపడ్డాడు. విశాఖపట్నం ప్రాంతంలోని ఏజెన్సీ ఏరియాల్లో పరిచయాలు పెంచుకుని గంజాయి కొనుగోలు చేసి మార్కాపురం పరిసరాల్లో అమ్మకాలు చేయసాగాడు. ఇతని వద్ద పట్టణంలోని విజయాటాకీస్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్, తాడి తిరుమలయ్యలు గంజాయి కొనుక్కుని వ్యసనపరులైన యువతకు అమ్మకాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పట్టణ పోలీసులు బుధవారం స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో గంజాయితో కలిగి ఉన్న గోపీనాథ్, ఇమ్రాన్, తిరుమలయ్యలను అరెస్ట్ చేశారు. వారి వద్ద 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చడంతో న్యాయాధికారి రిమాండ్ విధించారు. సమావేశంలో మార్కాపురం సీఐ పి.సుబ్బారావు, టౌన్, రూరల్ ఎస్సైలు ఎం.సైదుబాబు, రాజమోహన్‌రావు, అంకమ్మరావులు పాల్గొన్నారు.