వెలుగులో డీపీఎంల మార్పు
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:56 PM
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగులో సంస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు మన జిల్లాలో ఎక్కువమంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు (డీపీఎం)ఉండగా, కొన్ని జిల్లాల్లో అతి తక్కువమంది మాత్రమే పనిచేస్తున్నారు
ఐదుగురు మాత్రమే ఇక్కడ..
ఏడుగురు బయట జిల్లాలకే
ఇద్దరు ఏపీఎంలు కూడా
జిల్లాలో ఎక్కువకాలం పనిచేసిన వారు,
ఆరోపణలు ఉన్నవారికి స్థానచలనం
పూర్తయిన బదిలీల కౌన్సెలింగ్
నేడో, రేపో వెలువడనున్న ఉత్తర్వులు
ఒంగోలు నగరం, జూన్ 5 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగులో సంస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు మన జిల్లాలో ఎక్కువమంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు (డీపీఎం)ఉండగా, కొన్ని జిల్లాల్లో అతి తక్కువమంది మాత్రమే పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల్లో అ యితే డీపీఎంలు ఒకరిద్దరే పనిచేస్తున్నారు. సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఐదుగురు మాత్రమే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు పనిచేయాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో 13 మంది డీపీఎంలు పనిచేస్తుండగా వీరిలో ఐదుగురిని జిల్లాలో ఉంచి మిగిలిన ఎనిమిది మందిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కృపారావు, దానం, లక్ష్మిరెడ్డి, రజనీకాంత్, అంబేడ్కర్‌లు జిల్లాలోనే ఉండనున్నారు. వీరు పోను మిగిలిన వారిలో నరసింహారావు, డేవిడ్, రాంబాబు, సునీత, సుధాకర్, కృష్టకుమారి, విజయమ్మ ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. జిల్లాలో ఇప్పటివరకు డీపీఎంగా పనిచేసిన కత్తి కళ్యాణ్ ఇటీవల ఉద్యోగ వి రమణ చేశారు. దీంతో మిగిలిన ఏడుగురిని మార్చనున్నారు. కాగా ఈ ఏడుగురు డీపీఎంలకు ఇటీవల విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అందులో వారు కోరుకున్న చోటికి బదిలీ చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలో ఇద్దరు ఏపీఎంలు కూడా అదనంగా ఉన్నారు. వీరిని జోనల్ స్థాయిలోని పక్క జిల్లాలకు బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు వెలుగులో ఉన్న ఒక్కో విభాగాన్ని ఒక్కో డీపీఎం పర్యవేక్షించగా ఇప్పుడు ఆ పోస్టులను కుదించటంతో రెండు విభాగాలకు ఒక్కరే డీపీఎం పర్యవేక్షణ చేయనున్నారు. ఐబీ, హెచ్‌డీ విభాగాలకు ఇప్పటివరకు వేర్వేరు డీపీఎంలు ఉండగా ఇక నుంచి ఈ రెండు విభాగాలు ఒకే డీపీఎం పరిధిలోకి వెళ్లనున్నాయి. ఫైనాన్స్, హెచ్ ఆర్ విభాగాలకు ఒకరు, బ్యాంకు లింకేజి, ఉన్నతి విభాగాలకు ఒకరు, లైవ్‌లీ హుడ్స్ విభాగానికి ఒ కరు డీపీఎంగా పనిచేయనున్నారు. మొత్తం మీద జిల్లా నుంచి ఏడుగురు డీపీఎంలకు ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేయనుంది. ఇలా బయటకు జిల్లాలకు పంపుతున్న వారిలో ఎక్కువ కాలం పాటు జిల్లాలో పనిచేసిన వారు, నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న వారు ఉన్నట్లు సమాచారం.