వైద్యశాఖలో బదిలీల సందడి
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:52 PM
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. గతనెల 31వ తేదీన బదిలీలకు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు జారీచేశారు. ఈ నెల 19వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు.
నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన
10, 11 తేదీల్లో అభ్యంతరాలపై పరిశీలన
14న ఫైనల్ జాబితా విడుదల
15 నుంచి 17వ తేదీ వరకు కౌన్సెలింగ్
జిల్లాలో పది రకాల కేడర్ బదిలీలకు శ్రీకారం
వైద్యాధికారులకు మాత్రం గుంటూరులో..
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. గతనెల 31వ తేదీన బదిలీలకు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు జారీచేశారు. ఈ నెల 19వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న పది రకాల కేడర్ ఉద్యోగుల బదిలీలకు ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. వైద్యాధికారుల బదిలీలు మాత్రం గుంటూరు ఆర్జేడీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జరగనున్న ల్యాబ్ టెక్నీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంపీహెచ్ మేల్, ఎంపీహెచ్ ఫిమేల్, డ్రైవర్లు, ఎఫ్‌ఎంవోలు, ఎంఎంవోలు, స్వీపర్లు, అటెండర్లను మార్చనున్నారు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులతోపాటు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న మినిస్ట్రీరియల్ ఉద్యోగులు మూడు నుంచి ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తుంటే వారికీ స్థానచలనం కలిగించనున్నారు.
ఉద్యోగ సంఘాల వారికి తప్పదు
ఉద్యోగ సంఘాల గుర్తింపు ఉన్న సభ్యులను ప్రస్తుతం పనిచేస్తున్న చోట నుంచి అదే కార్యాలయంలో మరోచోటకు, అక్కడ ఖాళీలు లేకపోతే సమీపంలోని ప్రాంతాలకు పంపాలని మార్గదర్శకాలు జారీచేశారు. దీంతో తదనుగుణంగా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని శుక్ర, శనివారాల్లో పరిశీలన చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 9వ తేదీన స్వీకరిస్తారు. ఆయా దరఖాస్తులపై ఏమైనా అభ్యంతరాలు వస్తే ఈనెల 10, 11 తేదీల్లో సంబంధిత అధికారులు పరిష్కరిస్తారు. ఈనెల 14తేదీన బదిలీలకు సంబంధించి ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు. ఈనెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బదిలీల్లో ఏమైనా తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో బదిలీల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.