Share News

కొని.. పక్కనే తాగేయ్‌!

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:47 AM

విచ్చలవిడిగా రోడ్ల పక్కన మద్యం తాగడాన్ని ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వం పాత విధానాన్ని అమలుచేయనుంది. మద్యం షాపుల పక్కనే సిట్టింగ్‌ కోసం పర్మిట్‌ రూంల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో మద్యం దుకాణాలు మినీ బార్లుగా మారబోతున్నాయి.

కొని.. పక్కనే తాగేయ్‌!

మందుబాబులకు పక్కాగా కిక్కు

ఇక ఎక్కడపడితే అక్కడ తాగడం కుదరదు

మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూంలు

జనాభా ప్రాతిపదికన బార్‌ లైసెన్స్‌లు

ఎక్సైజ్‌ శాఖకు ఆదాయం

ఒంగోలు క్రైం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): విచ్చలవిడిగా రోడ్ల పక్కన మద్యం తాగడాన్ని ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వం పాత విధానాన్ని అమలుచేయనుంది. మద్యం షాపుల పక్కనే సిట్టింగ్‌ కోసం పర్మిట్‌ రూంల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో మద్యం దుకాణాలు మినీ బార్లుగా మారబోతున్నాయి. రోడ్ల పక్కన మద్యం తాగి అకతాయిలు గొడవలు సృష్టిస్తున్నారు. దీంతో ప్రయాణికులు, పాదచారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పర్మిట్‌రూంల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మందుబాబులకు మద్యం దుకాణం వద్దనే గ్లాసు, నీళ్లు, తినుబండారాలు దొరికే అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలో 278 మద్యం దుకాణాలు ఉన్నాయి. పర్మిట్‌ రూంకు ప్రత్యేక లైసెన్స్‌ కోసం రూ.5 లక్షల చొప్పున సుమారు ఏడాదికి రూ.13.9 కోట్లు ఆబ్కారీ శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

వచ్చేనెల 1 నుంచి నూతన బార్ల విధానం

రాష్ట్రంలో నూతన బార్ల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. జనాభా ప్రాతిపాదికన బార్ల లైసైన్సులు ఇవ్వనున్నారు. ఈ విధానం వచ్చేనెల 1 నుంచి అమలులోకి రానుంది. లాటరీ పద్ధతిలో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఈ బార్లలో కూడా గీత కార్మికులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు. 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతంలో లైసెన్స్‌ ఫీజు రూ.35లక్షలు, 5 లక్షలు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతంలో రూ.75 లక్షలు బార్లకు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. అదేసమయంలో బారుకు కనీసం 4 దరఖాస్తులు విధిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 25 బార్లు ఉండగా ఒంగోలులో 15, మార్కాపురం 5, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, చీమకుర్తిలలో ఒక్కో బారు ఉంది. ఈ మేరకు ఒంగోలు, మార్కాపురంలలో బార్‌ లైసైన్స్‌ ఫీజు రూ.55 లక్షలు, మిగిలిన 5 ప్రాంతాలలో రూ. 35 లక్షలుగా నిర్ణయించారు. దీంతో అప్లికేషన్‌ ఫీజు రూ.5లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉంది. అంటే ఒక్కో బార్‌కు కనీసం 4 చొప్పున 25 బార్లకు 100 అప్లికేషన్‌లు వస్తే ఫీజు రూపంలోనే రూ.5 కోట్లు లభించే అవకాశం ఉంది. లైసెన్స్‌ ఫీజు ద్వారా ఏడాదికి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 10 , 2025 | 01:47 AM