Share News

సందడి సందడిగా..

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:24 AM

జిల్లావ్యాప్తంగా శుక్రవారం పాఠశాలల్లో తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు సందడిసందడిగా సాగాయి. వివిధ స్థాయిల్లోని మొత్తం 2,409 విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశిం చగా తదనుగుణంగా ఆయా విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు.

సందడి సందడిగా..
కొణిజేడులో విద్యార్థిని ప్రోగ్రెస్‌ను తల్లికి వివరిస్తున్న మంత్రి స్వామి, పక్కన కలెక్టర్‌ రాజాబాబు

జిల్లా అంతటా విద్యాసంస్థల్లో పీటీఎంలు

2,409 పాఠశాలల్లో నిర్వహణ

కొణిజేడులో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్‌

పలుచోట్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హాజరు

ఒంగోలు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా శుక్రవారం పాఠశాలల్లో తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు సందడిసందడిగా సాగాయి. వివిధ స్థాయిల్లోని మొత్తం 2,409 విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశిం చగా తదనుగుణంగా ఆయా విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్య క్రమ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.53.79లక్షలు విడుదల చేసింది. ఆర్థిక భారం లేకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు మేనేజ్‌మెంట్‌ కమిటీల సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. కార్యక్రమం జరిగిన అత్యధిక విద్యాసంస్థల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు. కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్న చోట మరింత ప్రత్యేకత కనిపించింది. విద్యాసంస్థల ప్రాంగణాల ముఖద్వారాలను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. సమావేశానికి హాజరువుతున్న తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు. పలుచోట్ల సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రార్థన గీతాలతోపాటు దేశభక్తి గీతాలను పలువురు విద్యార్థులు ఆలపించి అలరించారు. కొన్ని హైస్కూళ్లలో వందల సంఖ్యలో విద్యార్థులు, పదుల సంఖ్యలో టీచర్లు ఉండగా పెద్దసంఖ్యలో తల్లిదండ్రులు హాజరుకావడంతో కోలాహలం నెలకొంది.

సందడి చేసిన నేతలు

ప్రభుత్వపరంగా జిల్లాస్థాయి కార్యక్రమం టంగుటూరు మండలం కొణిజేడులో నిర్వహించగా మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్‌ రాజాబాబు, డీఈవో కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్‌ బాలికల హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం మోటుమాల కేజీబీవీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ హాజరయ్యారు. సంతనూతలపాడులోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ పాల్గొన్నారు. పీసీపల్లి జడ్పీ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. గిద్దలూరు పట్టణంలోని జడ్పీ బాలికల హైస్కూల్‌లో జరిగిన పీటీఎంలో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొనగా మార్కాపురంలోని జడ్పీ హైస్కూల్‌తోపాటు కేకేమిట్ల మండలం గోట్లగట్టు హైస్కూలులో జరిగిన కార్యక్రమాలకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. ముండ్లమూరులోని కేజీబీవీలో జరిగిన పీటీఎంలో దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, వైపాలెంలోని హైస్కూలులో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ బ్రహ్మంచౌదరి పాల్గొన్నారు. అలాగే పలుచోట్ల జిల్లా అధికారులు హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల పురోగతిపై టీచర్లు రూపొందించిన పత్రాలను తల్లిదండ్రులకు అందించారు. ఇటీవల మాక్‌ అసెంబ్లీకి హాజరైన విద్యార్థులను అలాగే వివిధ అంశాలలో గుర్తింపు తెచ్చుకున్న వారిని ఈ సందర్భంగా సత్కరించారు.

Updated Date - Dec 06 , 2025 | 01:24 AM