Share News

ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభం

ABN , Publish Date - May 20 , 2025 | 10:34 PM

హనుమాన్‌ జయంతి సందర్భంగా పీసీపల్లి మండలంలోని వెంగళాపురం గ్రామసమీపంలో పాలేటిగంగ దగ్గర 36అడుగుల అభయాంజనేయస్వామి దేవస్థానం కమిటీ వారు ఏర్పాటుచేసిన జాతీయస్థాయి ఎడ్ల పోటీలను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు.

ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభం
ఎడ్ల బలప్రదర్శన పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

పీసీపల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ జయంతి సందర్భంగా పీసీపల్లి మండలంలోని వెంగళాపురం గ్రామసమీపంలో పాలేటిగంగ దగ్గర 36అడుగుల అభయాంజనేయస్వామి దేవస్థానం కమిటీ వారు ఏర్పాటుచేసిన జాతీయస్థాయి ఎడ్ల పోటీలను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దృఢమైన శరీరం, నడకలో రాజసం, పందెంలో పౌరుషంతో దేశం గర్వించదగ్గ ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి అండగా నిలిచిన ఎడ్లను ప్రోత్సహాస్తూ ఈప్రాంత సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న అభయాంజనేయస్వామి దేవస్ధానం చైర్మన్‌ కొంపల్లి మాలకొండయ్య అభినందనీయులన్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఔత్సాహిక గ్రామీణ పోటీలు కరువయ్యాయని అన్నారు.

మంగళవారం నిర్వహించిన వ్యవసాయ విభాగం ఎడ్ల పోటీలలో కడపజిల్లా ఖాజీపేట మండలం రహమత్నాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి లక్ష్మీరెడ్డి, బాపట్ల జిల్లా ఉప్పుమాగులూరు గ్రామానికి చెందిన తనుబొద్ధి రవిశంకర్‌రెడ్డికి చెందిన ఎడ్లు 5113.3మీటర్లు లాగి మొదటి బహుమతి రూ.50,116 గెలుచుకున్నారు. పత్తిపాడు మండలం పెద్దగొడ్డపాడు గ్రామానికి చెందిన గరికపాటి వెంకట్‌ జీఎల్‌ఆర్‌ బుల్స్‌ 5002.7మీటర్లు లాగి రెండో బహుమతి రూ.40,116 సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

బుధవారం జూనియర్‌ ఎడ్ల విభాగ ప్రదర్శన, గురువారం సీనియర్‌ ఎడ్ల విభాగ ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కొంపల్లి మాలకొండయ్య, వెల్ది కొండయ్య, గుదే నాగేశ్వరరావు, కొంపల్లి మధు, పరిమి ఈశ్వరరావు, వేమూరి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 10:34 PM